ఓయూలో నేడు విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ నేతల సమావేశం
ABN , First Publish Date - 2023-09-20T04:22:19+05:30 IST
తెలంగాణ సాధన ఉద్యమంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. జీవితాలతో పాటు చదువులను పణంగా పెట్టి పోరాడి, పోలీసు కేసులు, జైలు పాలైనవారిని పట్టించుకునేవారే కరువయ్యారు.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
తార్నాక, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధన ఉద్యమంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. జీవితాలతో పాటు చదువులను పణంగా పెట్టి పోరాడి, పోలీసు కేసులు, జైలు పాలైనవారిని పట్టించుకునేవారే కరువయ్యారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి ఉద్యమం వైపు మరల్చారని.. ఆ హామీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని నిరుద్యోగులు వాపోతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకులు బాగుపడాలంటే ఉద్యమమే మార్గమంటూ నిరుద్యోగులు, విద్యార్థులు ఓయూలో ఒక్కటవుతున్నారు. కేసీఆర్ పాలనలో దగాపడ్డ విద్యార్థి- నిరుద్యోగ, ఉద్యమ నేతల అత్యవసర సమావేశం బుధవారం ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో నిర్వహించనున్నారు. దీనికి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.