వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: హరీశ్‌

ABN , First Publish Date - 2023-07-21T03:35:50+05:30 IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలను అందించాలని చెప్పారు. సబ్‌ సెంటర్‌ నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల వరకు వైద్యులు, సిబ్బంది అంతా ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో మంత్రి గురువారం అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల(డీఎం అండ్‌ హెచ్‌వో)తో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎమర్జెన్సీ వైద్యసేవలను అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. ప్రజలకు 24 గంటల పాటు వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(040-24651119)ను ఏర్పాటు చేశామన్నారు. కాగా, వర్షాలు, వరదలు, ముంపు వల్ల ప్రజలు ప్రమాదాల బారినపడకుండా, ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే తక్షణ సహాయం అందించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పెట్రో, బ్లూ కోల్ట్స్‌ సిబ్బందితో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్ని జాగృత పరుస్తున్నారు.

Updated Date - 2023-07-21T03:35:50+05:30 IST