సీఎం క్యాంప్ ఆఫీసుగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీ?
ABN , First Publish Date - 2023-12-11T03:26:02+05:30 IST
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీసీ)లో ఏర్పాటు కానుందా ? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తుంది.
మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి
సంస్థ కార్యకలాపాలపై రేవంత్ ఆరా
33 ఎకరాల ప్రాంగణంలోని వివిధ బ్లాకుల పరిశీలన
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీసీ)లో ఏర్పాటు కానుందా ? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తుంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీ ప్రాంగణంలోని గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి సీఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా ఉంది. ఇందుకు బలం చేకూరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీసీని ఆదివారం సందర్శించారు. ప్రాంగణంలోని వివిధ బ్లాకులను సందర్శించి వివరాలు సేకరించారు. సంస్థలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, సంస్థ కార్యకలపాలపై అక్కడి ఫ్యాకల్టీతో మాట్లాడారు. అనంతరం ఆ సంస్థ డీజీ డాక్టర్ శశాంక్ గోయల్ సీఎంకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అయితే, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇటీవల వరకు ప్రగతి భవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. దీంతో వేరే ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఇందుకు దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీ ప్రాంగణం సరైన చోటని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ప్రాంగణంలో ఒకేసారి దాదాపు 150 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన నాలుగు హాళ్లు, పరిపాలక మండలి సమావేశం నిర్వహణకు వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో వేర్వేరు బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే రోజువారీ జరిగే కార్యకలాపాలకు భద్రతా పరమైన ఇబ్బందులు కూడా ఉండవనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీసీ అటానమ్‌సగా ఉండడంతో ముఖ్యమంత్రి హోదాలో సీఎం ఆ సంస్థను సందర్శించారనే చర్చ కూడా ఉంది. దీంతో క్యాంపు కార్యాలయం అంశంలోఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. కాగా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీసీ సందర్శనలో సీఎం వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.