ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌..

ABN , First Publish Date - 2023-06-01T03:39:25+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన(టీఎ్‌సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ.. హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌లో అరెస్టైన విద్యుత్తు శాఖ డీఈ రమేశ భారీ కుట్ర రచించినట్లు సిట్‌ గుర్తించింది.

ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌..

రమేశ టార్గెట్‌ రూ.10 కోట్లు!

37 మంది నుంచి రమేశకు రూ. కోటి నగదు

మరిన్ని మాస్‌ కాపీయింగ్‌లకు ప్రణాళిక..ప్రత్యేక కంట్రోల్‌ రూం

ముందుగానే ఇన్విజిలేటర్లతో ఒప్పందం.. సిట్‌ రిమాండ్‌ రిపోర్టు

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన(టీఎ్‌సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ.. హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌లో అరెస్టైన విద్యుత్తు శాఖ డీఈ రమేశ భారీ కుట్ర రచించినట్లు సిట్‌ గుర్తించింది. అయితే ప్రశ్నపత్రం లీకేజీ.. లేకుంటే మాస్‌ కాపీయింగ్‌ అన్నట్లు లక్ష్యంగా పెట్టుకున్న రమేశ.. టీఎ్‌సపీఎస్సీ ప్రకటించిన అన్ని పరీక్షలు పూర్తయ్యేలోపు రూ.10 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిట్‌ వర్గాలు నిర్ధారించాయి. ఆ వివరాలను రమేశ రిమాండ్‌ రిపోర్ట్‌లో పొందుపరిచాయి. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) పరీక్షలో నలుగురితో, ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురితో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడని, ఏఈ ప్రశ్నపత్రాన్ని హైదరాబాద్‌ కోచింగ్‌ సెంటర్‌లో 30 మంది అభ్యర్థులకు విక్రయించాడని.. ఈ 37 మంది నుంచి రమేశకు రూ. కోటి దాకా ముట్టినట్లు ఆధారాలను సేకరించింది.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి

తొలుత ఏఈ మాస్టర్‌ ప్రశ్నపత్రం తన చేతికి రాగానే.. టీఎ్‌సపీఎస్సీలోని పక్కా సోర్స్‌ నుంచి ఆ పేపర్‌ వచ్చిందని నిర్ధారించుకున్న రమేశ.. పూల రవికిశోర్‌ అడిగినంత ఇచ్చేసి, కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కోచింగ్‌ సెంటర్‌లో 30 మంది అభ్యర్థులకు రూ.లక్షల్లో వసూలు చేసి, ఆ కాపీలను అందజేశాడు. పరీక్షలు జరిగాక.. తన చేతికి వచ్చిన ప్రశ్నపత్రం 100ు సరైందేనని నిర్ధారించుకుని, తదుపరి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి కుట్రపన్నాడు. అయితే.. అది సాధ్యం కాకపోవడంతో.. ప్లాన-బీలో భాగంగా హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు తెర తీశాడు. ఓ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసి.. మైక్రో రిసీవర్స్‌ను అభ్యర్థులకు అందజేసి, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. అంతకు ముందే.. తన నెట్‌వర్క్‌లో ఉన్న అభ్యర్థుల పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లను మచ్చిక చేసుకున్నాడు.

అలా డీఏవో పరీక్షలో నలుగురు, ఏఈఈ పరీక్షలో ముగ్గురు అభ్యర్థులతో మాస్‌ కాపీయింగ్‌ చేయించాడు. వాయువేగంతో అభ్యర్థులకు సమాధానాలను చేరవేశాడు. ఇందుకోసం గూగుల్‌, చాట్‌జీపీటీని వాడుకున్నాడని సిట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ విజయవంతం కావడంతో.. తర్వాత జరిగే గ్రూప్‌ పరీక్షల్లోనూ దీన్ని అమలు చేయాలని, తద్వారా రూ.10 కోట్ల దాకా సంపాదించాలనే టార్గెట్‌ పెట్టుకున్నట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. కాగా.. రమేశ హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు సహకరించిన ఇన్విజిలేటర్ల చిట్టాను సిట్‌ ఇప్పటికే సేకరించింది. ఒకట్రెండ్రోజుల్లో వారి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. కోర్టు అనుమతితో రమేశను మరోమారు కస్టడీకి తీసుకునేందుకు సిట్‌ సన్నద్ధమవుతోంది. కాగా, భార్య అనుమానాస్పద మృతి కేసులో రమేశ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సిట్‌ గుర్తించింది. రమేశకు నేర చరిత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం బయటపడ్డట్లు సమాచారం.

Updated Date - 2023-06-01T03:39:25+05:30 IST