RAJIREDDY : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత
ABN , First Publish Date - 2023-08-19T05:00:36+05:30 IST
మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు.. మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సాయన్న అలియాస్ మీసాల సత్తెన్న అనారోగ్య కారణాలతో మరణించారు.
నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం విప్లవోద్యమానికి ఆకర్షితుడై పీపుల్స్‌వార్‌లోకి
1977లో చేరిక.. 1996-97లో కేంద్ర కమిటీలోకి
2007లో కేరళలో అరెస్టు
2009లో బెయిల్‌పై విడుదలై మళ్లీ అడవులకు..
ఆయనపై దేశవ్యాప్తంగా కేసులు.. రూ.కోటి రివార్డు
మృతిపై ప్రకటన చేయని మావోయిస్టు పార్టీ
మృతదేహం వీడియో సోషల్‌మీడియాలో వైరల్
పెద్దపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు.. మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సాయన్న అలియాస్ మీసాల సత్తెన్న అనారోగ్య కారణాలతో మరణించారు. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జబ్బగట్ట ఉసూరు బ్లాక్ దండకారణ్యంలో ఆయన చనిపోయినట్లు సమాచారం. ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు నివాళులు అర్పిస్తున్న వీడియో ఒకటి శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఛత్తీ్‌సగఢ్ పోలీసులు ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. అయితే, మావోయిస్టు పార్టీ మాత్రం రాజిరెడ్డి మృతిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. తొలితరం మావోయిస్టు అయిన రాజిరెడ్డి.. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తి, మల్లోజుల కోటేశ్వర్‌రావు తదితరుల సమకాలికుడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లా్‌సపూర్ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్ల రాధమ్మ, వెంకట్‌రెడ్డి దంపతుల ప్రఽథమ కుమారుడు రాజిరెడ్డి. ఆయన విద్యాభ్యాసం అంతా మంథనిలోనే జరిగింది. ఇంటర్ వరకూ చదువుకున్న ఆయన.. విద్యార్థి దశలోనే ఆర్‌ఎ్‌సయూలో చేరారు. అప్పుడే రత్నమ్మతో ఆయనకు వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమార్తె.. శ్రీలత అలియాస్ స్నేహలత ఉన్నారు. చదువుకునే రోజుల్లో విప్లవోద్యమాలకు ఆకర్షితులైన రాజిరెడ్డి.. కూతురు పుట్టిన కొద్దిరోజులకే 1977 ప్రాంతంలో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. ఐదేళ్ల తర్వాత ఆయన భార్య రత్నమ్మ కూడా అడవిబాట పట్టారు. అప్పటినుంచి వారి కుమార్తె.. రాజిరెడ్డి తమ్ముడైన భీమారెడ్డి వద్ద పెరిగింది.
1996-97లో ఆయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పనిచేసిన రాజిరెడ్డి.. సంగ్రామ్, సాయన్న, మీసాల సత్తన్న, అలోక్, దేశ్‌పాండే వంటి పేర్లతో గుర్తింపు పొందారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌తో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవోద్యమానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. వ్యూహాలు రచించడంలో రాజిరెడ్డిది అందెవేసిన చేయి అని అంటారు. 1986లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి, ఖమ్మం జిల్లా కరకగూడెం స్టేషన్‌పై దాడి, ఆదిలాబాద్ జిల్లా తపాలాపూర్‌లో నలుగురి హత్య వంటి అనేక కేసుల్లో ఆయన నిందితుడు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో పీపుల్స్‌వార్ చేసిన తొలి హత్య తపాల్‌పూర్ ఘటనలో కొండపల్లి సీతారామ య్యను ఏ1గా, రాజిరెడ్డిని ఏ2గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది.
అరెస్టు.. విడుదల..
రాజిరెడ్డి 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా అంగన్‌మలైలో పోలీసులకు చిక్కడంతో.. వారు ఆయన్ను కరీంనగర్ జిల్లాకు తీసుకువచ్చారు. పోలీసులు ఆయన్ను 2007 డిసెంబరు 18న మెట్‌పల్లి కోర్టులో, 22న మంథని కోర్టులో హాజరుపరిచారు. అడవుల బాట పట్టిన తర్వాత ఏనాడూ ఇంటిముఖం చూడని ఆయన.. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తల్లిని అప్పుడే చూసుకున్నారు. 14 రోజుల కస్టడీ అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. దాదాపు 22 నెలల తర్వాత 2009 అక్టోబరు 9న బెయిల్‌పై విడుదలైన రాజిరెడ్డి.. మళ్లీ అడవిబాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజిరెడ్డి భార్య రత్నమ్మ సైతం ఆయన దారిలోనే నడిచారు. కూతురు శ్రీలతకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు ఉద్యమబాట పట్టిన ఆమె.. భర్తతో కలిసి పని చేశారు. దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశాక ఒక ఎన్‌కౌంటర్‌లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా.. రాజిరెడ్డి కూతురు శ్రీలత (స్నేహలత) తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్‌లో పనిచేస్తున్న కాలంలో ఉద్యమ సహచరుడు, ఓయూ ప్రొఫెసర్ అయిన కాశీంను పెళ్లి చేసుకున్నారు. ఇక.. రాజిరెడ్డి మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఊరి ప్రజలు, రాజిరెడ్డితో అనుబంధం ఉన్న వ్యక్తులు, తెలిసిన వారు.. వారి ఇంటికి వచ్చి ఆయన సొదరుడు భీమారెడ్డిని ఓదార్చారు.
తీరని అమ్మ కోరిక..
అజ్ఞాతంలో ఉన్న రాజిరెడ్డిని చూడాలని.. తన చివర ఘడియల్లో కుమారుడు తోడుగా ఉండాలని ఆయన తల్లి రాధమ్మ ఎంతగానో తపించారు. కానీ, ఆ కోరిక నెరవేరకుండానే కన్నుముశారు. 1977లో అడవుల్లోకి వెళ్లిన రాజిరెడ్డి 2007లో మంథని కోర్టుకు వచ్చినప్పుడే ఆమె చూశారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇంటికి రావాలని కుమారుణ్ని పలుమార్లు అడిగారు. కానీ.. తాను జీవితాంతం ప్రజల కోసమే పని చేస్తానని రాజిరెడ్డి స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ఆమె కన్ను మూయగా.. కడచూపునకు కూడా రాజిరెడ్డి నోచుకోలేదు.
మృతదేహాన్ని ఇంటికి పంపండి
పోలీసు కేసుతో మా అన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. తండ్రి, తల్లి చనిపోయినప్పుడు కూడా ఇంటికి రాలేదు. మా అన్న బిడ్డను కూడా నేనే పెంచి, చదివించాను. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన మృతదేహాన్ని మా కుటుంబానికి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- భీమారెడ్డి, రాజిరెడ్డి తమ్ముడు