ఎన్నాళ్లీ లీకేజీలు!
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:06 PM
ప్రజల గొంతు తడపాల్సిన తాగునీరు వృఽథాగా పోతోంది. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
ప్రజల దాహర్తిని తీర్చాల్సిన తాగానీరు వృథా
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల లీకేజీలు
గేట్‌వాల్వ్‌ల వద్ద చెరువులుగా మారిన వైనం
రోడ్లపై పారుతున్న తాగునీరు
పట్టించుకోని అధికారులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
ఘట్‌కేసర్, డిసెంబరు 17 : ప్రజల గొంతు తడపాల్సిన తాగునీరు వృఽథాగా పోతోంది. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి పైపులైన్లు ఎప్పుడు పగిలిపోతాయో, వాటికి ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారో ఎవరికి తెలియని అయోమయ పరిస్ధితి నెలకొన్నది. మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో నెలల తరబడి తాగునీరు వృఽథాగాపోతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా వాటర్ ట్యాంకుల వద్ద పరిస్థితి ఆధ్వానంగా మారింది. పగిలిన పైపులైన్లకు కనీస మరమ్మతులు లేక నెలల తరబడి తాగునీరు వృథాగా పోతోంది. అనేక చోట్ల గేట్‌వాల్వ్‌లకు ఏళ్లతరబడి కనీస మరమ్మతులు లేక వాల్వ్‌లు తిప్పగానే నీరంతా బయటకొచ్చి రోడ్లపై పారుతున్నది. పలుచోట్ల వాల్వ్‌ల వద్ద నల్లాలు వచ్చే సమయంలో చెరువులు తలపిస్తున్నాయి. నీటి సరఫరా నిలిచిపోయిన అనంతరం వాల్వ్‌ల వద్ద నిలిచిన నీరు కలుషితమై తిరిగి పైపుల్లోకి చెరుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘట్‌కేసర్‌లోని ఎరిమల్లెవాగు వంతెన వద్ద పై్‌ప్‌లైన్ పగిలి నీరంతా పైకి ఎగజిమ్ముతూ వృథాగా పోతున్న నియంత్రణ చర్యలు చేపట్టక పోవడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్కడే ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద పైపు పగిలి నీరు నెలపాలవుతున్నది. పరిశుభ్రమై తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాల్సి అధికారులు తాగునీటి కలుషితంపై కనీస చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ట్యాంకు ఉన్నా మిషన్ భగీరథ నీరేక్కడ
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిగూడలోని మారుతినగర్‌లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 5లక్షల లీటర్ల సామర్ధ్యంతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును నిర్మించారు. దాదాపు ఎనిదేళ్లుగా ఆ ట్యాంకు నుంచి కేవలం దాదాపు 50ఇళ్లకు నీటిని అందిస్తూ అలంకార ప్రాయంగా మార్చారు. నేటికీ అనేక కాలనీలకు పైపులు వేశారు తప్పా, నీటి సరఫరాను మాత్రం మర్చి పోయారు. దీనికి ప్రధాన కారణం పైపులైన్ల మరమ్మతులు చేయించలేక చేతులెత్తేశారు. కార్మిశాఖ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఘట్‌కేసర్ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి కనీస చర్యలు చేపట్ట లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకైనా తాగునీటి ఇబ్బందులు గుర్తుకు రాకపోవడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఘట్‌కేసర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ముల్లిపావని, కమిషనర్ సాబేర్ అలీ వాటర్‌మెన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా ఘట్‌కేసర్‌లో ప్రజలకు మిషన్ భగీరధ తాగునీరు అందకపోవడానికి ప్రజాప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టి, కలుషితం కాకుండా ప్రజల తాగునీటి ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
తాగునీరు రావడం లేదు
శివారెడిగూడలోని శ్రీనిధి కాలనీకి ఇప్పటి వరకూ మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు. కొన్నేళ్ల క్రితం ఇళ్లల్లోకి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ నీటి సరఫరా మాత్రం మరిచారు. కాలనీ పక్కనే పెద్ద ట్యాంకు కట్టారు. అయిన తాగునీరు మాత్రం సరఫరా కావడం లేదు. ఇప్పటికైనామున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తాగునీటిని అందించాలి.
-కె. మీన, గృహిణి, శివారెడ్డిగూడ
రోడ్లపై పారుతున్న నీరు
నల్లాలు ఓపెన్ చేయగానే పలు చోట్ల రోడ్లపై నీరు పారుతున్నది. వాల్వ్‌ల వద్ద నీరు బయటకు రావడంతో కలుషితమై రోగాలు ప్రబలే ప్రమాదముంది. అలాగే తాగునీరు వృఽథా కాకుండా చూడాలి. చాలా మంది మిషన్‌భగీరధ నీటిని తాగుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోని తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టాలి.
- కుంటోళ్ల సరోజన, గృహిణి, ఘట్‌కేసర్
తాగునీరు వృధా కాకుండ చర్యలు
తాగునీరు వృథాకాకుండా చర్యలు చేపడతాం. పైపులు పగిలితే వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. వాటర్‌మెన్‌లతో సమావేశం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. తాగు నీటి సమస్యలు తలెత్తకుండా ఇన్‌చార్జులను ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షిస్తున్నాం. తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
- ఎండీ సాబేర్ అలీ, కమిషనర్, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ