Man̄chiryāla: మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Dec 25 , 2023 | 10:28 PM
మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ (ఏబీఎస్‌ఎస్) పథకం కింద మంచిర్యాల స్టేషన్ ఎంపిక కావడంతో మహర్దశ పట్టనుంది. స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయని, వసతులు పెరగనున్నాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 25: మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ (ఏబీఎస్‌ఎస్) పథకం కింద మంచిర్యాల స్టేషన్ ఎంపిక కావడంతో మహర్దశ పట్టనుంది. స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయని, వసతులు పెరగనున్నాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా 200ల పైచిలుకు స్టేషన్‌లు అమృత్ భారత్ పథకంకు ఎంపిక కాగా ఇందులో మంచిర్యాల రైల్వేస్టేషన్ ఉంది. ఈ పథకం కింద పలు అభివృద్ధి పనులను చేపట్టడంతోపాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, అటాచ్డ్ బాత్‌రూలు, అధునాతన టాయిలెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. సీసీ కెమెరాలు, ఎస్కలేటర్లు, స్టేషన్ ఆవరణలో షాపింగ్, పార్కింగ్ స్థలం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 12 మీటర్ల వెడల్పు అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఫ్లాట్ ఫారం నెంబర్ 1 నుంచి 2 కు, 3 నుంచి 4కు అనుసంధానం చేయనున్నారు. స్టేషన్ ఎంట్రెన్స్‌ను అందంగా తీర్చిదిదద్దడానికి భారీ ఎత్తున కళాత్మకమైన ఆర్చ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతం వన్‌సైడ్ మొదటి ఫ్లాట్‌ఫారం వైపు మాత్రమే బుకింగ్ కౌంటర్‌లో టికెట్లు ఇస్తున్నారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండడంతో రెండో ఫ్లాట్ ఫారం వైపు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు రోజుకు 4 లక్షల ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. రైల్వే స్వచ్ఛ భారత్‌లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జోనల్ స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా మంచిర్యాల ఎంపికైంది.
- మోడ్రన్ డిజైన్ దిశగా..
మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్టేషన్‌ను ఆధునీకరించడానికి రూ.52 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రోజు మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి 17 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోజు, వారానికి ఒకసారి వచ్చే 40 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. రోజుకు రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. స్టేషన్‌లో రాకింగ్ పాయింట్ కూడా ఉంది. బియ్యం, వడ్లు, యూరియా లోడ్, గూడ్స్ ట్రైన్‌ల ద్వారా లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుంది. ఆధునీకరణ జరిగితే ఆదాయం మరింత సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
- పట్టణానికి రెండు వైపులా ప్రయాణికులకు సౌకర్యంగా మారుతుంది. స్టేషన్‌లోకి వచ్చి, వెళ్లే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు, దూర ప్రాంత ప్రయాణికులు బస చేసేందుకు డార్మెటరీ రూమ్‌లు, విశాలమైన హాల్, కారిడార్‌లు, ఫుట్‌పాత్‌లు, ఎస్కలేటర్లు నిర్మించనున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసరంగా బయటకు వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. పార్శిల్ కౌంటర్లను అభివృద్ధి చేసి గూడ్స్ వాహనాలు కౌంటర్ల వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేయనున్నారు. సోలార్ సిస్టం ప్యానల్ సిస్టంలు ఏర్పాటు చేసి ఇంధన ఖర్చులు తగ్గించడం వంటివి చేపట్టనున్నారు. స్టేషన్‌ను కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణహితంగా తీర్చిదిద్దనున్నారు.
- రక్షణ సమస్యలతో సతమతం
మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో రక్షణ సమస్యలు ఉన్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. మూడో నెంబరు ఫ్లాట్‌ఫారం ద్వారా టౌన్ 2 నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పక్కనే వైన్‌షాపు ఉండడం వల్ల పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ఫుల్‌టైం రైల్వే సబ్ ఇన్‌స్పెక్టర్ లేకపోవడం, రామగుండం నుంచి ఇక్కడకు వచ్చి విధులు నిర్వహించడంతో ఇబ్బందికరంగా మారుతుంది. సిబ్బంది కొరతతో టికెట్ కౌంటర్ ఒక్కటే నడుస్తుంది. ప్రయాణికులు క్యూలో గంటల తరబడి నిల్చుని ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం లోపిస్తుంది. తాగునీరు లేకపోవడంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. కార్లు, ఆటోలు నిలిపేందుకు స్థలం లేకపోవడంతో ట్రైన్ దిగిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.