TS Assembly Results : మేజిక్కా.. హ్యాట్రిక్కా!?
ABN , First Publish Date - 2023-12-03T03:27:05+05:30 IST
ఎన్నికల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో ఈసారి అధికారం ఏ పార్టీకి దక్కనుందన్న అంశంపై స్పష్టత రానుంది.
నెల రోజుల ఉత్కంఠకు తెరపడేది నేడే
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో షురూ
11.30 గంటలకల్లా స్పష్టం కానున్న ట్రెండ్
ఫలితాల వెల్లడికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్
ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ఒక్కరి మదిలో ఎంతో ఉత్కంఠ! అన్నిటికీ సమాధానం ఆదివారం! మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి! క్రమక్రమంగా ఉత్కంఠకూ తెరపడనుంది!! అయితే.. ‘‘మనం 69 స్థానాల్లో గెలుస్తున్నాం! మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది’’ అంటూ పార్టీ కార్యకర్తల ఎదుట కేసీఆర్ భరోసా వ్యక్తం చేస్తే.. ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎక్కడ కేసీఆర్ కొనేస్తారోననే భయంతో ప్రతి వ్యూహాన్ని కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది! అభ్యర్థులను మధ్యాహ్నానికల్లా హైదరాబాద్‌కు తీసుకొచ్చి క్యాంపులకు తరలించే సన్నాహాలు చేస్తోంది! హంగ్ వస్తే ట్రబుల్ షూటింగ్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దించింది!!
తెలంగాణ ప్రజలు మార్పునకే ఓటేశారా!? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎట్టకేలకు ఈసారి ఆదరించారా!? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందా!?
కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారా!? హ్యాట్రిక్ సాధించిన తొలి దక్షిణాది సీఎంగా నిలుస్తారా!? వరుసగా మూడోసారీ బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందా!?
బీజేపీ ఈసారి డిపాజిట్లను దాటి ముందుకు వెళుతుందా!? ఫలితాల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్టేనా!? లేక, డబుల్ డిజిట్‌కు చేరే అవకాశాలూ ఉన్నాయా!?
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో ఈసారి అధికారం ఏ పార్టీకి దక్కనుందన్న అంశంపై స్పష్టత రానుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుండడంతో విజేతలు, పరాజితులు ఎవరన్నది తేలిపోనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు 9న ఎన్నికల సైరన్ మోగగా, డిసెంబరు 3న ఫలితాల వెల్లడితో ఎన్నికల క్రతువు ముగియనుంది. ఈ మేరకు ఫలితాలను వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో 1,798 టేబుళ్లపై 2,417 రౌండ్లలో ఫలితాలను వెల్లడించనుంది. ఒక్కో నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నచోట రౌండ్లు, టేబుళ్లను పెంచి మరీ ఏర్పాట్లు చేశారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల లెక్కింపు ప్రక్రియ కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ స్థానంలో 26; కరీంనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్‌పుర స్థానాల్లో 25, వేములవాడలో 24 రౌండ్లలో ఫలితాలను వెల్లడించేలా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి స్థానాల్లో 20 టేబుళ్లలో లెక్కింపు జరపనున్నారు.
హుజూరాబాద్, తుంగతుర్తి, పటాన్‌చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపును 18 టేబుళ్లలో; సంగారెడ్డి, కరీంనగర్, కోదాడల్లో 16 టేబుళ్లలో లెక్కించనున్నారు. అతి తక్కువగా భద్రాచలంలో 13 రౌండ్లు, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15 రౌండ్లలోనే ఫలితాలు తేలనున్నాయి. దాంతో, రాష్ట్రంలో మొట్టమొదటి ఫలితం భద్రాచలం నియోజకవర్గం నుంచి వెల్లడి కానుంది. తర్వాత, అదే జిల్లాలోని అశ్వారావుపేట, హైదరాబాద్ జిల్లాలోని చార్మినార్ నియోజకవర్గ ఫలితాలు రానున్నాయి. కౌంటింగ్‌ను మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నచోట వాటితోపాటు ఈవీఎం ఓట్లను కలిపి సమాంతరంగా లెక్కించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితాల వెల్లడికి ఎన్నికల కమిషన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనుంది. రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించిన వెంటనే ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రారంభమైన మూడు, నాలుగు గంటల్లోనే ఫలితాలపై ఒక స్పష్టత రానుంది. ఉదయం 11.30 గంటలకల్లా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న దానిపై ఒక అంచనా వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.