కేసీఆర్ వల్లే మేడిగడ్డ కుంగింది
ABN , First Publish Date - 2023-11-06T04:19:41+05:30 IST
కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిప్ప చేతికొస్తుందని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని టీజేఎస్
తానే ఇంజనీరై.. తప్పుడు నిర్ణయాలు
బ్యారేజీలు నాసిరకంగా నిర్మించారు
అవి పనికి రాక రాష్ట్రానికి దెబ్బ: కోదండరాం
హుస్నాబాద్/సైదాపూర్/వడ్డెపల్లి, నవంబరు 5: కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిప్ప చేతికొస్తుందని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ ఏకపక్ష, నియంతృత్వ విధానాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని, రాష్ట్రానికి కోలుకోని దెబ్బ తగిలిందన్నారు. డిజైన్, నాణ్యత లోపాలతో పాటు నిర్మాణం సక్రమంగా జరగలేదని కేంద్ర నిపుణులు తేల్చారన్నారు. కోదండరాం ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా జాగీర్‌పల్లి విలేకరులతో మాట్లాడారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించడంలో ఉద్యమకారుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ‘కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని, నేనే చుక్కలు, నేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను.. సర్వం నేనే’లా వ్యవహరించారని కోదండరాం విమర్శించారు. కేసీఆర్ తానే ఇంజనీర్‌గా తప్పుడు నిర్ణయాలతో బ్యారేజీలు, డ్యామ్‌లను నాసిరకంగా నిర్మించడంతో అవి కుంగిపోయి పనికిరాకుండా పోతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేశారని, లక్ష కోట్లు అప్పు చేశారన్నారు. ఇవాళ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు కావడానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లు కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ధరణి తీసేస్తారని, అదే జరిగితే రైతులకు నష్టమని బెదిరిస్తున్న కేసీఆర్ జూటా మాటలను నమ్మవద్దని చెప్పారు. గత పదేళ్లుగా దోపిడీ చేస్తున్న కేసీఆర్ దుష్ట పాలనను అంతమొందించడంలో ఉద్యమకారులు కీలక పాత్ర పోషించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.