ప్రేమ.. అప్పు.. కిడ్నాప్!
ABN , First Publish Date - 2023-06-26T02:45:46+05:30 IST
ఎనిమిదేళ్లుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరొకరితో ప్రేమాయణం సాగిస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు.. తాను అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగివ్వమని ఆమెను కోరాడు. ఆ డబ్బు ఇస్తానని పిలిచిన ఆమె ప్రియుడు అనుచరులతో కలిసి ఆ యువకుడిపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశాడు....
ప్రియుడి వద్ద రూ.25 లక్షలు తీసుకున్న యువతి
మరొకరితో ఎనిమిది నెలలుగా ప్రేమాయణం..
అప్పు తీర్చమన్నందుకు ప్రియుడి కిడ్నాప్‌కు యత్నం
డబ్బు ఇస్తానని పిలిచి దాడి చేసిన బీజేపీ నేత
తప్పించుకున్న బాధితుడు.. ఇద్దరి అరెస్టు
ఘట్‌కేసర్ రూరల్, జూన్ 25: ఎనిమిదేళ్లుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరొకరితో ప్రేమాయణం సాగిస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు.. తాను అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగివ్వమని ఆమెను కోరాడు. ఆ డబ్బు ఇస్తానని పిలిచిన ఆమె ప్రియుడు అనుచరులతో కలిసి ఆ యువకుడిపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలో ఆదివారం సాయంత్రం తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లికి చెందిన కీసర అవినా్‌షరెడ్డి(29), పీర్జాదిగూడ బుద్ధనగర్‌కు చెందిన అరోషికరెడ్డి(25) అలియాస్ అన్షితారెడ్డి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అన్షిత తండ్రి చేరెడ్డి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అరోషిక తన అవసరాల కోసం అవినాష్ వద్ద రూ.25లక్షలు తీసుకుంది. అయితే, అవినా్‌షకు దూరంగా ఉంటున్న అరోషిక.. సిద్దిపేటకు చెందిన బీజేపీ నేత గందగోని చక్రధర్‌గౌడ్‌తో 8నెలలుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అవినా్‌షరెడ్డి తన డబ్బులు తిరిగి ఇవ్వమని అరోషికను అడిగాడు. డబ్బు తిరిగివ్వడం ఇష్టంలేని అరోషిక.. అవినాష్ అడ్డుతొలగించుకునేందుకు చక్రధర్‌గౌడ్‌తో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా అరోషికకు ఇచ్చిన సొమ్మును తిరిగి ఇస్తానని చక్రధర్‌గౌడ్ ఆదివారం సాయంత్రం అవినా్‌షరెడ్డికి ఫోన్ చేశాడు. ఘట్‌కేసర్‌లోని వరంగల్-హైదరాబాద్ హైవే పక్కన ఉన్న వందన హోటల్ దగ్గరకు రావాలని పిలిచాడు. అవినా్‌షరెడ్డి అక్కడికి చేరుకోగానే చక్రధర్‌గౌడ్ తన కారు(టీఎస్09 ఎఫ్‌జే6062)లో మాట్లాడుకుందామని పిలిచాడు. కారులోకి తీసుకెళ్లి తన అనుచరులతో కలిసి అవినా్‌షరెడ్డిపై దాడి చేశాడు. వారి నుంచి తప్పించుకుని అవినా్‌షరెడ్డి కారులో నుంచి బయటికి దూకగా.. తిరిగి అతన్ని లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అవినా్‌షరెడ్డి కేకలు విన్న స్థానికులు అక్కడికి పరుగెత్తుకు రాగా చక్రధర్‌గౌడ్ అతని అనుచురులు అవినాష్ ఫోన్ లాక్కోని కారులో పరారయ్యారు. దీనిపై అవినా్‌షరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధి పిర్జాదీగూడలో చక్రధర్‌గౌడ్, అతని అనుచరుడు మామిళ్ల గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.