Share News

లోక్‌సభ ఎన్నికలు.. బదిలీలపై కసరత్తు!

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:11 AM

రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటోంది.

లోక్‌సభ ఎన్నికలు.. బదిలీలపై కసరత్తు!

ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు

ఒకే చోట మూడేళ్ల సర్వీసు నిండితే తప్పకుండా బదిలీ

వివరాలు పంపాలని సీఎస్‌ ఆదేశాలు

జనవరిలో ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో సర్కారు

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల విధులతో సంబంధం ఉండే ఆయా శాఖల్లోని అధికారుల వివరాలను సేకరిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ 30వ తేదీ లోపు లోక్‌సభకు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. దానికిఅనుగుణంగా ఈసీ.. ముందస్తుగానే ఎన్నికల షెడ్యూలును విడుదల చేస్తుంది. షెడ్యూలు వెలువడకముందే అధికారుల బదిలీల ప్రక్రియను ముగించాలంటూ ఈసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. బదిలీల సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించింది. ఎన్నికల విధులతో సంబంధం ఉండే జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), జిల్లా ఉప ఎన్నికల అధికారులు (డిప్యూటీ డీఈఓ), రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు (ఈఆర్‌ఓ), ఏఈఆర్‌ఓల బదిలీలను చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ అధికారులు వారి వారి సొంత జిల్లాల్లో పని చేయకూడదని, ఒక చోట మూడేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పకుండా బదిలీ చేయాలని పేర్కొంది. ఏదైనా ప్రత్యేక సమస్య ఉన్నట్లయితే... అలాంటి అధికారుల వివరాల్ని తమకు పంపించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికల విధులు చేపట్టాల్సిన అధికారుల్లో బదిలీలకు అర్హత ఉన్న వారి వివరాలు పంపించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అన్ని శాఖలను ఆదేశించారు. వివరాలు అందగానే.. ప్రభుత్వం అంతర్గత బదిలీలను చేపట్టనుంది. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రకాల బదిలీలపై నిషేధం ఉంది. కానీ.. ఈసీ ఆదేశాల మేరకు నిషేధపు ఉత్తర్వుల నిబంధనలను సడలిస్తూ ఈ బదిలీలను చేపట్టనున్నారు. జనవరిలో ఈ బదిలీలన్నింటినీ పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Updated Date - Dec 30 , 2023 | 03:11 AM