లాగ్‌బుక్‌లు మార్చేశారు!
ABN , First Publish Date - 2023-07-16T06:03:08+05:30 IST
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజుకున్న వివాదంతో సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్స్ మారిపోయాయి. నల్లగొండ జిల్లాలోని సబ్‌స్టేషన్లలో పాత లాగ్‌బుక్స్‌ను విద్యుత్తు అధికారులు ఈ నెల 13న (గురువారం) స్వాధీనం చేసుకోగా,
విద్యుత్తు సబ్‌స్టేషన్లకు కొత్త లాగ్‌బుక్‌లు.. కాంగ్రెస్ నేతల సబ్‌స్టేషన్ల సందర్శన ఫలితం
2 రోజుల కరెంటు సరఫరా వివరాలను కాగితాలపైనే నమోదు చేసిన ఆపరేటర్లు
నల్లగొండ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజుకున్న వివాదంతో సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్స్ మారిపోయాయి. నల్లగొండ జిల్లాలోని సబ్‌స్టేషన్లలో పాత లాగ్‌బుక్స్‌ను విద్యుత్తు అధికారులు ఈ నెల 13న (గురువారం) స్వాధీనం చేసుకోగా, శనివారం పలు సబ్‌స్టేషన్లలో కొత్త లాగ్‌బుక్స్ దర్శనమిచ్చాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నట్లుగా అబద్ధాలు చెబుతోందని, వాస్తవానికి 10 గంటలు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ నెల 12న యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బండసోమారం సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఒక రోజులో త్రీఫేజ్ కరెంటు 10 గంటలకు మించి రావడంలేదని రికార్డుల్లో పేర్కొన్న విషయాన్ని మీడియా ముఖంగా ఆధారాలతో ప్రకటించారు. దీంతోపాటు స్థానిక ఆపరేటర్ నర్సింహకు 12వ తేదీ అయినా నెల వేతనం అందలేదనే విషయాన్ని కూడా వెల్లడించారు. మరోవైపు అమెరికాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్‌ఎస్, ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీ ఆందోళనలకు దిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మండల డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఈ నెల 13న నల్లగొండలో యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల విద్యుత్తు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లను స్వాధీనం చేసుకోవాలని మౌఖికంగా ఏఈలకు ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు అదే సమావేశంలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని లైన్‌మన్లు లాగ్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేరోజు జిల్లా కేంద్రాల నుంచి వెళ్లిన ప్రత్యేక వాహనాలు లాగ్‌బుక్‌లను తీసుకుని జిల్లా కేంద్రాలకు చేరవేశాయి. దీంతో గురు, శుక్రవారాల్లో తెల్లకాగితాలపైనే సబ్‌స్టేషన్ల ఆపరేటర్లు విద్యుత్తు సరఫరా వివరాలు నమోదు చేశారు. శనివారం కొత్త లాగ్‌బుక్‌లు వచ్చాయి. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని కొన్ని సబ్‌స్టేషన్లలో మాత్రం ఇంకా కాగితాలపైనే విద్యుత్తు సరఫరా వివరాలు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి, లాగ్‌బుక్‌లను పరిశీలించి 10 గంటల నుంచి 15 గంటల మధ్యే ఉచిత విద్యుత్తు సరఫరా అవుతోందని చెప్పడంతో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నుంచి అన్ని సబ్‌స్టేషన్లలో 24 గంటలు త్రీఫేస్ ఉచిత విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ అంశం వివాదాస్పదం కాకముందు ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు త్రీఫేస్ విద్యుత్తు సరఫరా జరిగేది. మిగిలిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ మేరకు ఉన్నతాధికారులు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా అందించే సమాచారం ఆధారంగా కొద్దిగంటల పాటు త్రీఫేస్ విద్యుత్తు సరఫరా జరిగేది.