ఉత్తమ రచనలకు గౌరవం

ABN , First Publish Date - 2023-01-27T03:03:20+05:30 IST

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికి సాహితీ పురస్కారాలను ప్రకటించింది.

ఉత్తమ రచనలకు గౌరవం

2020 సాహితీ పురస్కారాలు

ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికి సాహితీ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనలను ఈ సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. పద్యకవితా ప్రక్రియలో కుంతీపురం కౌండిన్య తిలక్‌ రచించిన మహా పరిణయము, వచన కవితలో అఫ్సర్‌ రచించిన ఇంటివైపు పురస్కారానికి ఎంపికయ్యాయి. బాలసాహిత్యంలో పుప్పాల కృష్ణామూర్తి రచించిన వెన్నెల వాకిలి, కథానిక ప్రక్రియలో జీ.వెంకటకృష్ణ రచించిన దేవగరట్టు, నవలా ప్రక్రియలో నేరెల్ల శ్రీనివా్‌సగౌడ్‌ రచించిన దుల్దుమ్మ ఎంపికయ్యాయి. అదే విధంగా సాహిత్య విమర్శలో సంగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన దుర్భిణి, నాటక ప్రక్రియలో అద్దేపల్లి భరత్‌కుమార్‌ రచించిన నవ్వించే నాటికలు, అనువాదంలో ఏఎం అయోధ్యారెడ్డి రచించిన ఏడవకు బిడ్డా, వచన రచనలో పి.భాస్కరయోగి రచించిన హిందువుల పండుగలు పురస్కారానికి ఎంపికయ్యాయి. గేయ కవిత్వంలో వడ్డె ముద్దంగుల ఎల్లన్న రచించిన సబ్బండవాదం, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో మందరపు హైమవతి రచించిన నీలిగోరింట గ్రంథాలు పురస్కారానికి ఎంపికయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో త్వరలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవంలో విజేతలకు ఈ పురస్కారాలు అందజేస్తామని రిజిస్ట్రార్‌ వెల్లడించారు. విజేతలు ఒక్కొక్కరికీ రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామని తెలిపారు.

Updated Date - 2023-01-27T03:03:21+05:30 IST