ఉన్నత విద్యామండలి ఉన్నట్టా! లేనట్టా!
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:15 AM
రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి మనుగడపై గందరగోళం నెలకొంది.
పాలకవర్గాన్ని తొలగిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు
ప్రభుత్వ నిర్ణయం తమకు వర్తించదని అంటున్న చైర్మన్, వైఎస్ చైర్మన్లు
కొత్తవారిని నియమించని ప్రభుత్వం
ఆలస్యమైతే ఇబ్బందులేనని అభిప్రాయాలు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి మనుగడపై గందరగోళం నెలకొంది. ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొత్త ప్రభుత్వం.. వారి స్థానంలో ఇంకా కొత్తవారిని నియమించలేదు. మరోవైపు.. ప్రభుత్వం జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులు తమకు వర్తించవని ఈ పోస్టుల్లో కొనసాగుతున్నవారు చెబుతున్నారు. తమనే కొనసాగించాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో పాతవారే చైర్మన్, వైస్ చైర్మన్లుగా వీరే కొనసాగుతారా? కొత్తవారు వస్తారా? అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధం ఎక్కువ రోజులు కొనసాగితే.. లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే ప్రవేశ పరీక్షలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే జనవరి నుంచి ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు ఉన్నత విద్యామండలి పాలకవర్గం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లుగా వెంకటరమణ, ఎస్.కె.మహమూద్ నియమితులయ్యారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లతోపాటు అడ్వయిజర్లు, ఇతర పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ప్రభుత్వ ఉత్తర్వులు మాకు వర్తించవు..
తమను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తమకు వర్తించవని ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లు అంటున్నారు. తాము రాజీనామా చేస్తేనే ఈ పదవులు ఖాళీ అవుతాయని, లేనిపక్షంలో చట్టప్రకారం నిర్ణీత గడువు దాకా తామే కొనసాగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శిని కలిసి వివరించారు. అంతేకాకుండా తమను తొలగిస్తున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులో పొరపాట్లు ఉన్నాయని, తమ నియామకానికి సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనలేదని గుర్తు చేశారు. దాంతో సాంకేతికంగా ఇంకా తాము విద్యామండలిలో కొనసాగుతున్నట్లేనని వారు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే.. ఇప్పటికీ తమను వద్దనుకుంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని స్పష్టం చేయాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాక స్పష్టత ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో అప్పుడప్పుడు వారు కార్యాలయానికి కూడా వచ్చి పోతున్నారు. కానీ, విధాన నిర్ణయాలను మాత్రం తీసుకోవడం లేదు. ఫైళ్లపై సంతకాలను కూడా చేయడం లేదని తెలిసింది.
అధికారిక వెబ్‌సైట్‌లో వారి పేర్లే..!
ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా పాతవారే ఉన్నట్టు వివరాలున్నాయి. దాంతో పాతవారు ఉన్నట్టా! లేనట్టా! అనే విషయంపై కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళం ఎక్కువ రోజులు కొనసాగితే ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీజీసెట్ వంటి ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం జనవరిలోనే ఆయా నిర్వహణ కమిటీలను, కన్వీనర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏయే యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏయే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలనే అంశాన్నీ ఖరారు చేయాల్సి ఉం టుంది. అనంతరం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే.. ఉన్నత విద్యామండలి విషయంలో వెంటనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.