Share News

శాసనసభ పాత భవనంలో మండలి

ABN , First Publish Date - 2023-12-11T03:45:05+05:30 IST

అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

శాసనసభ పాత భవనంలో మండలి

సెంట్రల్‌ హాలుగా ప్రస్తుత మండలి భవనం.. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం

పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

ఎల్పీ కార్యాలయాలను తొలగిస్తాం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి

రెండ్రోజులకే ప్రశ్నిస్తున్న హరీశ్‌.. పదేళ్లలో ఏం చేశారని నిలదీత

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్‌ భవనంగా ఉన్న పాత శాసనసభ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం మండలి కొనసాగుతున్న భవనాన్ని సెంట్రల్‌ హాలుగా వినియోగిస్తామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు ప్రధాన రహదారి నుంచి కూడా వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన 9 ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న సీఎల్పీ, ఇతర ఫ్లోర్‌ లీడర్ల కార్యాలయాలను కూల్చివేసి, వాటిని ప్రాంగ ణం చివరలో నిర్మిస్తామని చెప్పారు. కొత్త భవనాల నిర్మాణం జరిగే వరకు వాటిని అసెంబ్లీలోని పైఅంతస్తులో సర్దుబాటు చేస్తామన్నారు.

పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి లలితా కళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని పార్లమెంటు తరహాలో లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్‌ హాలులా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ ఆదేశించినట్లు చెప్పారు. మంగళ, బుధవారాల్లో సీఎం, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. కొత్త అసెంబ్లీని నిర్మించే యోచన లేదన్నారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటై రెండురోజులైనా కాకముందే మాజీ మంత్రి హరీశ్‌రావు ఏం చేశారంటూ మాట్లాడుతున్నారని.. మరి పదేళ్లలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏంచేశారని నిలదీశారు. పదేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల మీద దృష్టి పెట్టలేదన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీల అంశంపై మాట్లాడుతూ.. ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలుండవని మంత్రి చెప్పారు. తప్పులు జరిగితే మాత్రం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంచి స్పందన వస్తోందని ఆయన చెప్పారు.

నెల రోజుల్లో రోడ్ల మరమ్మతులు..

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, నెలరోజుల్లోగా అన్ని రహదారులకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టి, ఓ కొలిక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ రోడ్లను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల గుంతలను మట్టిపోసి చదునుచేశారని.. తమ ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలుస్తానని మంత్రి చెప్పారు. అలాగే, ప్రాంతీయ రింగ్‌ రోడ్డు సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని, విజయవాడ-హైదరాబాద్‌ రహదారిని ఆరు లేన్లకు, హైదరాబాద్‌-కల్వకుర్తి రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడంతోపాటు సీఆర్‌ఐఎఫ్‌ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ పని మల్కాపూర్‌ వరకు పూర్తయిందని, ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఈ రహదారికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రెండున్నర గంటల్లోనే విజయవాడ చేరుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డికి ఆర్‌అండ్‌బీ ఇంజనీర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు వి.బాలప్రసాద్‌, కార్యదర్శులు కిరణ్‌, రవి శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రి సంతకం చేసిన ఫైళ్ల వివరాలు..

నల్లగొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు రూ.100 కోట్లు కేటాయింపు.

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో లింగంపల్లి-దుగ్యాల రోడ్డును రూ.4.15 కోట్లతో బలోపేతం చేయడం.

14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌-గ్రేడ్‌ చేయడం.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడం. నకిరేకల్‌- నాగార్జునసాగర్‌ మార్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం.

హైదరాబాద్‌-కల్వకుర్తి జాతీయ రహదారి 765లోని ఒక సెక్షన్‌ మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చడం.

రాష్ట్రానికి కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను అధికంగా కేటాయించేందుకు ప్రతిపాదనలు.

ఉద్యోగులకు సంబంధించిన మరో రెండు పరిపాలనా ఫైళ్లు.

Updated Date - 2023-12-11T03:45:06+05:30 IST