Kumaram Bheem Asifabad: నిర్మాణంలోనే జగన్నాథ్‌‘పూర్‌’

ABN , First Publish Date - 2023-06-02T22:26:23+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 15ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథపూర్‌(పెద్దవాగు) ప్రాజెక్టు పనులు నత్తను మించిన నడకతో సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీళ్లన్ని ప్రాణహిత పాలవుతున్నాయి.. బడ్జెట్‌లో ప్రతీఏటా నిధుల విడుదలలో ప్రభుత్వం మొండిచెయ్యి ఇస్తుండడంతో ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పెద్దవాగు పనులకు అతీగతి లేకుండా పోయింది.

 Kumaram Bheem Asifabad: నిర్మాణంలోనే జగన్నాథ్‌‘పూర్‌’

- పదిహేను ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్ట్‌

- ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి

- రెండేళ్లుగా నిధులివ్వని సర్కార్‌...

- మరో పది కోట్లు ఇస్తే ప్రధాన పనులన్నీ పూర్తి

- 15 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 15ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథపూర్‌(పెద్దవాగు) ప్రాజెక్టు పనులు నత్తను మించిన నడకతో సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీళ్లన్ని ప్రాణహిత పాలవుతున్నాయి.. బడ్జెట్‌లో ప్రతీఏటా నిధుల విడుదలలో ప్రభుత్వం మొండిచెయ్యి ఇస్తుండడంతో ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పెద్దవాగు పనులకు అతీగతి లేకుండా పోయింది. ఫలితంగా ప్రతీఏటా వర్షాకాలంలో వరదలొచ్చి నీరంతా నదుల పాలవుతున్నాయి. 250కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే 2006లో 124.64కోట్ల అంచనా వ్యయంతో పాలనాపరమైన మంజూరు ఇచ్చారు. నిర్మాణ పనులను అప్పట్లో 118.80కోట్లకు దక్కించుకోగా రెండేళ్ల కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలన్నది ఒప్పందం. అయితే కాలహరణం, నిధుల విడుదలలో చిక్కుల వంటి సమస్యలతో నిర్మాణ వ్యయం కాస్తా రెట్టింపయ్యింది. అయినప్పటికీ గుత్తేదారు పనులను పూర్తి చేయలేకపోయారు. పెద్దవాగుపై 1.05కి.మీల పొడవైన ఆనకట్ట నిర్మించడం ద్వారా రెండువైపులా తూములను ఏర్పాటు చేసి కాల్వలు తవ్వి పంట భూములకు నీరందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం కాగా ఇప్పటివరకు 85శాతం పనులు పూర్తయ్యాయి. మరో పది కోట్లు విడుదల చేస్తే భూ సేకరణ జరిపి ప్రధాన కాలువల పనులు పూర్తయే పరిస్థితి ఉంది. తద్వారా కొంతమేరకైనా ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రెండేళ్లుగా ఎక్కడి పనులక్కడే..

ఏఐబీపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పురోగతి రెండేళ్లుగా సమీక్షలకే పరిమితమైంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 185కోట్లు ఖర్చు చేయగా ఇందులో 108కోట్లు కేంద్ర ప్రభుత్వం 77కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాల్సి ఉన్నా గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పైసా విదిలించకపోవడంతో ప్రాజెక్టు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. ఈ ప్రాజెక్టు కింద మరో 80ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంది. ఇందుకు గాను రూ.10కోట్లు అవసరమవుతాయని, కనీసం 5కోట్లయినా ఇస్తే పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పదేపదే నివేదికలు పంపినా కనీస స్పందన లేదని తెలుస్తోంది.

Updated Date - 2023-06-02T22:26:23+05:30 IST