Share News

Komatireddy Venkat Reddy: నంది పురస్కారాలపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

ABN , Publish Date - Dec 29 , 2023 | 09:07 PM

నంది పురస్కారం.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా దీనికి పేరుంది. కానీ.. గత ఐదేళ్లుగా ఈ ‘నంది’ ఊసే లేదు. 2017లో చివరిసారిగా నంది అవార్డులను ప్రకటించారు. అంతే.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...

Komatireddy Venkat Reddy: నంది పురస్కారాలపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

Komatireddy Venkat Reddy: నంది పురస్కారం.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా దీనికి పేరుంది. కానీ.. గత ఐదేళ్లుగా ఈ ‘నంది’ ఊసే లేదు. 2017లో చివరిసారిగా నంది అవార్డులను ప్రకటించారు. అంతే.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కళాకారులకు ప్రోత్సాహాన్నిచ్చే ఈ నంది అవార్డుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేసినా.. ఏ ప్రభుత్వమూ స్పందించిన పాపాన పోలేదు. బహుశా ఈ పురస్కారాల వేడుక ఇక ఉండకపోవచ్చన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇలాంటి తరుణంలో.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ప్రకటిస్తామని ఆయన మాటిచ్చారు. హైదరాబాద్‌లోని దసపల్లాలో జరిగిన నటుడు మాగంటి మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా మంత్రి ఈమేరకు హామీ ఇచ్చారు.


ఈ వేడుక సందర్భంగా తొలుత మురళీమోహన్ మాట్లాడుతూ.. సినిమా అవార్డులను ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ హయాంలో ‘సింహా’ అవార్డులు ఇవ్వాలనుకున్నా.. అది కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను పోత్సాహిస్తే.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సినీ, టీవీ, నాటక రంగాల వారికి నంది అవార్డులను ఇచ్చి ప్రోత్సాహించారని గుర్తు చేసుకున్నారు. కానీ.. జగన్ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్ళ నుంచి అవార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సినీ అవార్డుల విషయాన్ని తీసుకువెళ్లాలని కోరారు. ఇందుకు సినిమాటోగ్రఫీ మంత్రి కోటమిరెడ్డి బదులిస్తూ.. గురువారమే (28/12/23) తాను, సీఎం కలిసి సినీ ప్రముఖులతో సమావేశంపై చర్చించుకున్నామని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానన్న ఆయన.. కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు వచ్చి తమని కలవాలని అన్నారు.

చిన్నప్పటి నుంచి నంది అవార్డులు ఇవ్వడాన్ని తానూ చూస్తూ వచ్చానని, అవార్డులు ఇచ్చి గౌరవించుకోవటం అవసరమని కోమటిరెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డిని ఓప్పించి, అవార్డులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లోనే సీఎం రేవంత్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ విషయంపై మురళీమోహన్ లాంటి పెద్దలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలందరు ఒక్కటేనని.. ప్రాంతాలకు అతీతంగా సినిమా ప్రతిభావంతులకు అవార్డులను ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 29 , 2023 | 09:07 PM