కోకాపేట భూముల వేలం

ABN , First Publish Date - 2023-07-08T02:38:49+05:30 IST

కోకాపేటలో రెండో విడత భూముల వేలానికి హెచ్‌ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కోకాపేట భూముల వేలం

45.33 ఎకరాల అమ్మకానికి నోటిఫికేషన్‌

ఏడు ప్లాట్లుగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి

2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

హైదరాబాద్‌ సిటీ, జూలై7(ఆంధ్రజ్యోతి): కోకాపేటలో రెండో విడత భూముల వేలానికి హెచ్‌ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నియోపొలిస్‌ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయిస్తామని ప్రకటించింది. 3.9 నుంచి 9.1 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలం ఆగస్టు 3న జరగనుంది. కంపెనీలు, ట్రస్టులు, రిజిస్టర్డ్‌ సొసైటీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్‌, సెమీపబ్లిక్‌ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, జాయింట్‌ వెంచర్‌ పెట్టుబడిదారులు ఈ ప్లాట్ల కొనుగోలుకు అర్హులు. ఈ నెల 20న ప్రిబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈవేలంలో పాల్గొనాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.ఝట్టఛ్ఛిఛిౌఝఝ్ఛటఛ్ఛి.ఛిౌఝ లో జూలై 31 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ముందస్తు డిపాజిట్‌ కింద ఆగస్టు 1లోగా ప్రతీ ప్లాటుకు రూ.5 కోట్లు చెల్లించాలి. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈవేలం జరుగుతుంది. ఎకరానికి కనీస అప్‌సెట్‌ ధర రూ.35 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు బిడ్‌ పెంపుదలకు కనీసం రూ.25 లక్షలు ధరను పెంచాలని సూచించారు. కాగా, ఏడాది క్రితం కోకాపేటలో తొలివిడతగా 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండో విడత విక్రయాల ద్వారా కూడా అంతే మొత్తంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిజానికి, నియో పొలిస్‌తోపాటు గోల్డెన్‌ మైల్‌ పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములు కొనుగోలుకు గత ఏడాది చాలా సంస్థలు పోటీ పడ్డాయి. అత్యధికంగా రూ.60 కోట్లు దాకా చెల్లించి ఎకరం భూమిని కొనుగోలు చేశాయి. ఏడాది క్రితం ఈ లేఅవుట్లలో ఎకరం భూమి సగటున రూ.40 కోట్లకు అమ్ముడైంది. ఈ భూములు కొనుగోలు చేసిన సంస్థలు విలాసవంతమైన భారీ భవనాల నిర్మాణం చేపట్టాయి. అయితే కోకాపేటను అనుకొని ఉన్న ప్రాంతమంతా 111జీఓ పరిధి కావడం, అక్కడ ఆంక్షలు తొలగనుండటం రెండో విడత ఈవేలంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అమ్ముడవుతాయా.?

కోకాపేటలో రెండో విడత అమ్మకానికి పెట్టిన భూములు అమ్ముడవుతాయా? లేదా అనే సందిగ్ధం నెలకొన్నది. 111 జీవో ప్రభావంతోపాటు ఎన్నికల ఏడాది కావడం ఇందుకు ప్రధాన కారణాలు. ఎన్నికల ఏడాది కావడంతో రూ.కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్లు ఆసక్తి చూపరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు, డెవలపర్లకు రాజకీయ పార్టీలతో ఉండే బంధమే ఇందుకు కారణమని అంటున్నారు. కోట్లు పెట్టి ఇప్పుడు భూమి కొనుగోలు చేస్తే ఎన్నికల ఖర్చుకు ఇబ్బందులు తలెత్తే అవకాశముండటంతో ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు. అదేవిధంగా 111జీఓ తొలగింపు నిర్ణయంతో 1.32లక్షల ఎకరాల వరకు భూలభ్యత రానుంది. ఫలితంగా ఐటీ కారిడార్‌తో పోల్చితే 111 ఏరియాలో మరింత తక్కువ ధరకు భూములు వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఐటీ కారిడార్‌లో రియల్‌ వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి తరుణంలో కోకాపేటలో ఎకరం భూమిని రూ.35కోట్లకు పైగా వ్యయంతో ఎవరైనా కొనుగోలు చేస్తారా ? అనేది సందేహం. అయితే, ఈ రెండో విడత వేలాన్ని ఆరు నెలల ముందే నిర్వహించే బాగుండేదని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - 2023-07-08T02:40:15+05:30 IST