KishanreddY: దేశ గౌరవాన్ని తగ్గించకండి
ABN , First Publish Date - 2023-01-15T03:01:12+05:30 IST
దేశ ప్రతిష్ఠ, గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో ఐఎ్‌సఐ కార్యకలాపాలు, మత కలహాలు ఎలా తగ్గిపోయాయో గమనించాలన్నారు.
పాక్, శ్రీలంకతో భారత్‌కు పోలికా?
సైనికుల ఖ్యాతిని కించపరచొద్దు
మత విద్వేషాలను రెచ్చగొట్టకండి
సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హితవు
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రతిష్ఠ, గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో ఐఎ్‌సఐ కార్యకలాపాలు, మత కలహాలు ఎలా తగ్గిపోయాయో గమనించాలన్నారు. ‘‘దేశ సైనికుల గొప్పదనాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారు. పటిష్ఠమైన మన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్, శ్రీలంకతో పోలుస్తారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్ అంటారు.. ఇదేం పద్ధతి..? ప్రధాని మోదీని విమర్శించండి. కానీ దేశ గౌరవాన్ని తగ్గించవద్దు..’’ అని కేసీఆర్‌కు హితవు పలికారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇలాగే మత విద్వేషాలను రెచ్చగొడితే దేశం అఫ్గానిస్తాన్‌లా మారినా ఆశ్చర్యం లేదన్నారు.
తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రిని కాలేదు
తాను తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రిని కాలేదని మంత్రి కేటీఆర్‌నుద్దేశించి కిషన్‌రెడ్డి విమర్శించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ‘‘విద్యావంతుడు.. కాస్త ఆలోచించి మాట్లాడతారని కేటీఆర్ గురించి తెలంగాణ సమాజం అనుకుంది.. కానీ, ఆయన తండ్రి కంటే దిగజారి మాట్లాడుతున్నారు. సూర్యుడిపై ఉమ్మివేసినట్లుగా ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధులపై వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజీనామా లేఖతో రావాలని బండి సంజయ్ సవాల్ చేసినా.. సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కేటీఆర్ లాంటివారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు ఆహ్వానం పంపించాం..
సికింద్రాబాద్‌లో ఆదివారం జరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించామని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా, వందే భారత్ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇది ఆరో రైలు అని.. దేశవ్యాప్తంగా ఇలాంటి వంద రైళ్లను ప్రారంభించాలన్నదే లక్ష్యమని చెప్పారు. దీని షెడ్యూల్‌ను రైల్వే మంత్రి ఆదివారం ప్రకటిస్తారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా మూడో దఫా అపాయింట్‌మెంట్ లెటర్లను ఈ నెల 20న ప్రధాని వర్చువల్‌గా.. తాను, కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ హైదరాబాద్‌లో నేరుగా అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు కేంద్రం రూ.146కోట్లు ఇచ్చిందని చెప్పారు. తాను కూడా ఒక టీబీ రోగిని దత్తత తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్‌ను పూర్తిగా అమలుచేయకపోవడం విచారకరమని అన్నారు. మలక్‌పేట ఆస్పత్రి ఘటన దురదృష్టకరమన్నారు.