REVANTH : రెండు చోట్లా కేసీఆర్‌ ఓటమి ఖాయం

ABN , First Publish Date - 2023-08-22T04:48:25+05:30 IST

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పోటీ చేసే రెండు సీట్లలోనూ ఆయన ఓటమి ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందన్నారు.

REVANTH : రెండు చోట్లా కేసీఆర్‌ ఓటమి ఖాయం

అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

కామారెడ్డిలో కేసీఆర్‌ పనిపడతాం

కామ్రేడ్లను కరివేపాకులా తీసేశారు

శ్రీకాంతాచారి తల్లిని అవమానించారు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పోటీ చేసే రెండు సీట్లలోనూ ఆయన ఓటమి ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందన్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వకపోవడం, కేసీఆర్‌ కూడా రెండు చోట్లా పోటీ చేస్తుండడం ఆ పార్టీ ఓటమి పాలవుతుందనడానికి సంకేతమన్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలని, సిటింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వాలని తాను విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించలేదని, ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తూ సిట్టింగ్‌లనూ మార్చారన్నారు. తద్వారా ఓటమిని ఒప్పుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ వామపక్షాలను కరివేపాకులా తీసిపారేశారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమైందన్నారు. రాష్ట్రంలో 2/3 మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పారిపోవాలనుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు ఉన్నాయని, కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం మైనారిటీలను అవమానించడమేనన్నారు. మాజీ మంత్రి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ అంతా షబ్బీర్‌ అలీకి అండగా ఉంటుందని, కామారెడ్డిలో కేసీఆర్‌ పనిపడతామన్నారు. సూర్యాపేట సభలోనూ కేసీఆర్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘మధ్యాహ్నం 12.03 గంటలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తంలో లిక్కర్‌ షాపుల డ్రా తీశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల’న్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌ అతి తెలివితేటలు ప్రదర్శించారని, రూ.99,999 వరకు మాత్రమే మాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌ ఆమెరికా పర్యటన అందుకే..

ఓఆర్‌ఆర్‌ లీజుతో ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్‌ అమెరికా వెళ్లారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మందు, పైసలు పంచబోనంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 119 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో పైసలు, మందు పంచబోమంటూ ఒట్టు వేయిస్తానని, దానికి కేటీఆర్‌ కూడా సిద్ధమేనా అని ప్రశ్నించారు. సూర్యాపేట సభలో శ్రీకాంతాచారి తల్లిని నిలబెట్టి కేసీఆర్‌ అవమానించారన్నారు.

మైనార్టీలకు 12% రిజర్వేషన్‌ ఏది?

మైనార్టీలకు 12% రిజర్వేషన్ల హామీని సీఎం కేసీఆర్‌ అమలుచేయకుండా మోసం చేశారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ డిక్లరేషన్‌పై షబ్బీర్‌ అలీ నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌-కమిటీ సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధిపై కమిటీకి కొన్ని వినతిపత్రాలు వచ్చాయని, మరోమారు సమావేశమై వాటిపై చర్చిస్తామన్నారు.

కోయిల ముందే కూసినట్టుంది: భట్టి

సీఎం కేసీఆర్‌ రెండుచోట్ల పోటీ చేస్తుండడంతోనే బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని అర్థమవుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన పాదయాత్ర విశేషాలు, రాష్ట్రంలోని సమస్యలను ఖర్గేకు వివరించానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ చేజారిపోతారో అనే ఆందోళనలో, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే కేసీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు. దీన్ని చూస్తే కోయిల ముందే కూసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో ఓటమి తప్పదన్న సర్వే ఫలితాల భయంతో కామారెడ్డిలో పోటీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ కేసీఆర్‌ చేస్తున్న విమర్శలకు ‘సెల్ఫీ విత్‌ కాంగ్రెస్‌ డెవల్‌పమెంట్‌’ కార్యక్రమం ద్వారా బదులిస్తామని భట్టి తెలిపారు.

వెంటనే కోడ్‌ అమలు చేయండి

సీఈసీకి టీపీసీసీ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ నిరంజన్‌ కోరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ 115 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారం కూడా మొదలైందంటూ ప్రకటన చేశారని, మారిన పరిస్థితుల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా రాష్ట్రంలో వెంటనే ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలన్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సోమవారం లేఖ రాశారు.

Updated Date - 2023-08-22T04:48:25+05:30 IST