కేసీఆర్‌ గీసిన గీత దాటను

ABN , First Publish Date - 2023-08-23T05:01:26+05:30 IST

ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను కేసీఆర్‌ను వీడలేదని, ఇపుడు కూడా ఆయన గీసిన గీత దాటనని జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు.

కేసీఆర్‌ గీసిన గీత దాటను

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య

భావోద్వేగంతో కంటతడి

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఆగస్టు 22: ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను కేసీఆర్‌ను వీడలేదని, ఇపుడు కూడా ఆయన గీసిన గీత దాటనని జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. వచ్చే ఎన్నికలకు ఘన్‌పూర్‌ టికెట్‌ కడియం శ్రీహరికి దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజయ్య క్యాంపు కార్యాలయానికి వచ్చారన్న సమాచారంతో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి కంటతడిపెడుతూ స్వాగతం పలికారు. వారి అభిమానాన్ని చూసిన రాజయ్య బోరున విలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి నుంచీ తాను త్యాగాలు చేస్తున్నానని అన్నారు. 2011లో కేసీఆర్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన చేయి పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగానన్నారు. నిన్న మొన్నటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత స్థానానికి తగ్గట్టు అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ హమీ ఇచ్చారని, ఆయన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అక్టోబరు 16న జరిగే కేసీఆర్‌ బహిరంగ సభకు సైనికుల్లా తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల నుంచి తనను కంటికి రెప్పలా కాపాడుకున్న కార్యకర్తలను వదిలి ఉండలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Updated Date - 2023-08-23T05:01:26+05:30 IST