కేసీఆర్ నోటిఫికేషన్లు.. కేటీఆర్ లీకులు
ABN , First Publish Date - 2023-03-19T02:54:51+05:30 IST
సీఎం కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తుంటే.. కొడుకు కేటీఆర్ ప్రశ్నపత్రాలను లీక్ చేసి అమ్ముకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పేపర్లు అమ్ముకుంటున్నారు.. లీకేజీలో ఆయన పీఏ తిరుపతి
అతడి మండలంలో 100 మందికి 100కు పైగా మార్కులు
బీఆర్‌ఎస్‌లో పెద్దతలకాయలను కాపాడేందుకు యత్నం
21న గవర్నర్‌ను కలుస్తాం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కామారెడ్డి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తుంటే.. కొడుకు కేటీఆర్ ప్రశ్నపత్రాలను లీక్ చేసి అమ్ముకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఎ్‌సపీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంఽధం ఉందన్నారు. అతనిది కరీంనగర్ జిల్లా మల్యాల మండలమని, ఈ మండలంలో వంద మంది గ్రూప్-1 పరీక్షలు రాయగా వీరందరికీ వందకు పైనే మార్కులు వచ్చాయన్నారు. వీరందరికీ కేటీఆర్ పీఏ నుంచే ప్రశ్నపత్రాలు అందాయని ఆరోపించారు. కేటీఆర్ తన పీఏతో పాటు బీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద తలకాయలను, టీఎ్‌సపీఎస్సీలో ఉన్నతాధికారులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.రేవంత్ రెడ్డి హాథ్ సే హాత్ జోడో పాదయాత్ర శనివారం కామారెడ్డి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజీపై కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండా విచారణాధికారులను పిలవకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతోనే సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. లీకేజీ కేసులో 9 మందిని అరెస్టు చేశారని, వారిని ఎందుకు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. కేవలం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలే నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు.
ఉన్నతాధికారులపై ఒత్తిడి లేకుండా చేయడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారన్నారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రాజశేఖర్‌రెడ్డి అని, సెక్రటరీ పీఏ ప్రవీణ్ అని, వ్యక్తిగత సిబ్బందే ప్రధాన నిందితులుగా ఉంటే ఆ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. లీకేజీ ఘటనలో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని కేటీఆర్ చెబుతుండగా రెండో వ్యక్తి బీఆర్ ఎస్‌కు చెందినవాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారన్నారు. ఈ రెండు పార్టీలూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. లీకేజీ కేసును నీరుగార్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాలు లీకైతే ఐటీ మంత్రికి ఏం సంబంధం ఉంటుందని కేటీఆర్ అనడం సిగ్గుచేటని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై 21న గవర్నర్ తమిళిసైను కలిసి వివరిస్తామని తెలిపారు. లీకేజీపై సీబీఐతో విచారణ జరపాలని, దానిపై నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లీకేజీకి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారి లో నిరుద్యోగ దీక్ష చేపడుతున్నామని రేవంత్ ప్రకటించారు. ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.