దేశంలోనే రిచెస్ట్‌ సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-04-11T02:50:55+05:30 IST

ప్రస్తుతం కేసీఆర్‌ దేశంలోనే రిచెస్ట్‌ ముఖ్యమంత్రి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

దేశంలోనే రిచెస్ట్‌ సీఎం కేసీఆర్‌

అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల

ఖర్చును భరిస్తానంటున్నారు: ఈటల

హనుమకొండ క్రైం, ఏప్రిల్‌ 10: ప్రస్తుతం కేసీఆర్‌ దేశంలోనే రిచెస్ట్‌ ముఖ్యమంత్రి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం లో పేదలను, విద్యార్థులను ఆదుకోలేని కేసీఆర్‌.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు ఎంత ఖర్చైన పెడతాననడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.వందల కోట్ల విలువ చేసే అసైన్డ్‌ భూములు చెరబట్టి అడ్డదారిలో విక్రయించారని ఆరోపించారు. పార్టీ ప్రారంభంలో అప్పులున్న పార్టీకి 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని సవాల్‌ విసిరారు. టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పోలీసుల నోటీసుల మేరకు సోమవారం వరంగల్‌ కమిషనరేట్‌లో విచారణకు హాజరైన ఈటల.. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు.

బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌ ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నాడని, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీ అనేది పూర్తిగా అబద్ధమని, పరీక్ష ప్రారంభం తర్వాత బయటికి వస్తే మాల్‌ప్రాక్టీస్‌ కిందకు వస్తుందన్నారు. అంతకుముందు విచారణలో..ఓ కార్యకర్త టెన్త్‌ ప్రశ్నపత్రం తనకు వాట్సా్‌పలో షేర్‌ చేసినట్లున్నాడని, తాను ఇంతవరకు ఆ నోటిఫికేషన్‌ ఓపెన్‌ చేయలేదని ఈటల పోలీసులకు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఈటల సెల్‌ఫోన్‌ పరిశీలించగా మహేశ్‌ అనే వ్యక్తి పంపించిన వాట్సాప్‌ మెసేజ్‌ ఓపెన్‌ చేయకుండా కనిపించింది. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అబ్దుల్‌ బారి, ఎస్‌బీ ఏసీపీ తిరుమల్‌, కమలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజీవ్‌ ఈటలను విచారించారు. విచారణలో ఈటల సానుకూలంగా స్పందించి సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-04-11T02:50:55+05:30 IST