కామారెడ్డి నుంచీ కేసీఆర్ పోటీ
ABN , First Publish Date - 2023-08-22T04:28:49+05:30 IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచీ పోటీకి దిగనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే సోమవారం బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా వెల్లడించారు.
ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’.. జూలై 21న కథనం
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచీ పోటీకి దిగనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే సోమవారం బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా వెల్లడించారు. పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేస్తున్నానని ప్రకటించారు. అయితే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని, సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘కామారెడ్డి నుంచి బరిలోకి కేసీఆర్’ శీర్షికన జూలై 21న కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఒకే ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసిన దాఖలాలు లేవు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన... 2009లో సీటు మారి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలోకి దిగి గెలిచారు. ఈసారి మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతానని ప్రకటించారు. మొత్తం 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చగా అందులో ఒకటి కామారెడ్డి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్థానంలో స్వయంగా కేసీఆరే బరిలోకి దిగనున్నారు. ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, వేములవాడ-చల్మెడ లక్ష్మినరసింహారావు, ఖానాపూర్-భూక్యా జాన్సన్ నాయక్, స్టేషన్ ఘన్‌పూర్-కడియం శ్రీహరి, ఆసిఫాబాద్-కోవా లక్ష్మి, వైరా-మదన్‌లాల్, బోఽథ్-అనిల్ జాదవ్. హుజురాబాద్ స్థానానికి పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేశారు. ములుగు నుంచి గతంలో చందూలాల్ పోటీచేయగా ఇప్పుడు బడే నాగజ్యోతికి అవకాశం ఇచ్చారు. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరిక మేరకే ఆయన కుమారుడికి అవకాశం కల్పించారు.