Kavitha : కవితకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం
ABN , First Publish Date - 2023-10-25T03:37:06+05:30 IST
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది.
30న తెలంగాణ అభివృద్ధిపై లండన్‌లో కీలకోపన్యాసం
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. తెలంగాణ స్థితిగతులను మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ‘‘డెవల్‌పమెంట్ ఎకనామిక్స్’’ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాయం చేయాల్సిందిగా కవితను వర్సిటీ కోరింది. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి కవిత లండన్‌లో పర్యటించిన సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఆమెతో భేటీ అయ్యారు. దాంతో తెలంగాణ అభివృద్థి మోడల్‌పై ఈ నెల 30న ప్రసంగించాలంటూ కవితకు వర్సిటీ ఆహ్వానం పంపింది. దాంతో తెలంగాణలో వ్యవసాయరంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత అంతర్జాతీయ వేదికగా ప్రసంగించనున్నారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లు సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ సృష్టించిన చరిత్ర, వైద్య, విద్యారంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై కూడా కవిత ప్రసంగించనున్నారు.