ఆత్మస్థైర్యం కోసం కర్రసాము ఎంతో అవసరం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:25 PM
సమాజంలో బాలబాలికల ఆత్మరక్షణ కోసం కరాటేతో పాటు కర్రసాము కూడా ఎంతో ముఖ్యమని తైక్వాండో కరాటే మాస్టర్ శ్రీహరి అన్నారు.
- తైక్వాండో కరాటే మాస్టర్ శ్రీహరి
- కర్రసాము శిక్షణ తరగతులు ప్రారంభం
గద్వాల అర్బన్, డిసెంబరు 17 : సమాజంలో బాలబాలికల ఆత్మరక్షణ కోసం కరాటేతో పాటు కర్రసాము కూడా ఎంతో ముఖ్యమని తైక్వాండో కరాటే మాస్టర్ శ్రీహరి అన్నారు. కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ తమిళనాడుకు చెందిన శ్రీనివాసులు సారథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్‌లో కర్రసాము శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా మాస్టర్ శ్రీహరి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా కర్రసాము విద్యను ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. అందులో భాగంగానే కర్రసాము మాస్టర్ శ్రీనివాసులు సారథ్యంలో జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులు క్రమశిక్షణతో కర్రసాము విద్యను నేర్చుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు తైక్వాండో కరాటేలో శిక్షణ ఇచ్చిన విధంగానే కర్రసాము విద్యలో కూడా తీర్చిదిద్దాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 150 మంది విద్యార్థులు శిక్షణ హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు శెట్టి, రంగస్వామి, రామేశ్వరి, మౌనిక, విద్యార్థులు ఉన్నారు.