కందులు అధరహో

ABN , First Publish Date - 2023-02-13T00:24:12+05:30 IST

జిల్లాలో రైతులు వరి సాగు వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో మెట్టపంటల సాగు తగ్గుతూ వస్తోంది. నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా పంటలకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తుండటంతో జిల్లా రైతాంగం వరి తప్ప ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం లేదు. వరి సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో మెట్టపంటల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం వరి పంటతో పాటు మెట్టపంటల సాగు పెంచాలని ప్రతీ సీజన్‌లో ప్రకటన చేస్తున్నా రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. వరి సాగుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

కందులు అధరహో

సూర్యాపేట మార్కెట్‌లో ధర రూ.7,344

రాష్ట్రంలోనే అత్యధికంగా పలికిన రేటు

పప్పు దినుసులకు మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌

సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 12: జిల్లాలో రైతులు వరి సాగు వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో మెట్టపంటల సాగు తగ్గుతూ వస్తోంది. నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా పంటలకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తుండటంతో జిల్లా రైతాంగం వరి తప్ప ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం లేదు. వరి సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో మెట్టపంటల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం వరి పంటతో పాటు మెట్టపంటల సాగు పెంచాలని ప్రతీ సీజన్‌లో ప్రకటన చేస్తున్నా రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. వరి సాగుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మెట్టపంటల సాగు తగ్గుతుండటంతో బహిరంగ మార్కెట్లలో పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొద్దిరోజులుగా వ్యవసాయ మార్కెట్లలో పప్పు దినుసుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మెట్ట పంటలను సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, సామాన్యు లు పుప్పు దినుసుల ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కంది పప్పు ధర రూ.105, పెసర పప్పు రూ.100, పల్లీలు రూ.60 నుంచి రూ.70 వరకు ధరలు ఉంది. మెట్ట పంటల సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

పేటలో కందులకు గరిష్ఠ ధర

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కొద్దిరోజులుగా కందులకు ధర గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రూ.2,960 ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో చేలు నీటమునిగాయి. అక్కడక్కడా కొద్దిపాటి పంట మాత్రమే రైతుల చేతికి వచ్చింది. పంట దిగుబడి తక్కువగా వచ్చిందని ఆందోళన చెందుతున్న రైతులకు వాటి ధరలు ఊరటను కలిగిస్తున్నాయి. కంది పంటకు బహిరంగ మార్కెట్లలో మద్దతుకు మించి అధిక ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు జనవరి చివరి మాసం నుంచి కందుల రాక ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ నాటికి మార్కెట్‌కు సుమారు 4,272 క్వింటాళ్ల కందులు వచ్చాయని మార్కెట్‌ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే కందులకు మార్కెట్‌లో మద్దతుకు మించి అధిక ధర లభిస్తోంది. ఈ నెల 11వ తేదీన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందులకు వచ్చిన ధర రాష్ట్రంలోనే ఏ ఇతర మార్కెట్లలో లేదు. పేట మార్కెట్‌లో అత్యఽధిక ధర రూ.7,344 పలికింది. జనగాం మార్కెట్‌లో కందులకు గరిష్ఠంగా రూ.6,862, కనిష్ఠంగా రూ.6,751 పలికింది. ఖమ్మం మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.7,002, కనిష్ఠ ధర రూ.6,300, అదేవిధంగా తిరుమలగిరి మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.7,286, కనిష్ఠ ధర రూ.6,666 పలికింది. అయితే వరంగల్‌, కేసముద్రం మార్కెట్లు పనిచేయలేదు.

ఆనందంగా ఉంది : మామిళ్ల లింగయ్య, కోటపహాడ్‌, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం

సూర్యాపేట మార్కెట్‌కు ఏడు బస్తాల కందులు తీసుకువచ్చా. క్వింటాకు రూ.7,344 ధర లభించింది. అర ఎకరంలో కంది సాగు చేయగా, వర్షాలతో పంట పోయింది. కేవలం ఏడు బస్తాల దిగుబడి మాత్రమే రాగా, మార్కెట్‌లో అందరికంటే నాకే ఎక్కువ ధర లభించడం ఆనందంగా ఉంది.

మెట్ట పంటలకు డిమాండ్‌ : ఎండి.ఫసియుద్దీన్‌, సూర్యాపేట మార్కెట్‌ కార్యదర్శి

ప్రస్తుతం మెట్ట పంటల కు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. కందులు, పెసర, వేరుశనగ పంటలకు మార్కెట్‌లో ఎక్కువ ధర ఉం ది. అయితే వీటి సాగు విస్తీ ర్ణం తక్కువగా ఉండటం, దిగుబడి కూడా తక్కువగా రావడంతో వ్యాపారస్థులు ఎక్కువ ధరకు కోట్‌ చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీతత్వంతో ధరలు పెరుగుతున్నాయి.

ఈ నెల 1వ తేదీ నుంచి 11 వరకు కందుల ధరలు ఇలా..

తేదీ గరిష్ఠ ధర కనిష్ఠ ధర

(రూపాయల్లో) (రూపాయల్లో)

1న 6,975 6,912

2న 7,052 7,034

3న 7,119 6,495

4న 7,173 6,782

9న 7,263 6,939

10న 7,191 6,894

11న 7,344 7,263

పేట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు

ఉమ్మడి జిల్లా రైతులకు ప్రయోజనం

ఇప్పటి వరకు 4,641 బస్తాల విక్రయం

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం రైతులకు కలిసివచ్చింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ మార్కెట్‌లో సైతం పత్తి కొనుగోళ్లు లేవు. దీంతో రైతులు ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లలో పత్తి విక్రయించేవారు. దీంతో రవాణాచార్జీలు పోగా చేతికి కొద్దిమొత్తంలో డబ్బు వచ్చేది. దీన్ని గుర్తించిన మార్కెటింగ్‌ అధికారులు మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు.

ఫలించిన మార్కెట్‌ అధికారుల యత్నం

పేట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు మా ర్కెటింగ్‌శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న కమీషన్‌దారులు, ఖరీదుదారులతో పలుమార్లు చర్చలు నిర్వహించడంతోపాటు పత్తి కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు వరంగల్‌, కేసముద్రం, ఏనుబాముల, ఖమ్మం తదితర వ్యవసాయ మార్కెట్లను పలుమార్లు సందర్శించారు. అక్కడ పత్తి కొనుగోలు చేసే విధానం, నిల్వ, రైతులకు డబ్బు చెల్లింపుపై కమీషన్‌దారులు, ఖరీదుదారులు అవగాహన పెంచుకున్నారు. దీంతో పేట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లకు పునాది పడింది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న జిన్నింగ్‌ మిల్లులతో సైతం మార్కెటింగ్‌ అధికారులు సంప్రదింపులు చేసి పత్తి వ్యాపారులను ప్రోత్సహించారు. దీంతో మార్కెట్‌లో గత ఏడాది నవంబరు 18వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, మిర్యాలగూడెం, భువనగిరి ప్రాంతాలకు చెందిన పత్తి వ్యాపారులు సైతం సూర్యాపేట మార్కెట్‌కు వచ్చి కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. అదేవిధంగా పేట మార్కెట్‌కు నల్లగొండ, యాదాద్రి జిల్లాల నుంచి సైతం రైతులు పత్తి తీసుకువస్తున్నారు. ఫలితంగా వారికి దూరాభారం తగ్గడంతోపాటు మంచి ధర లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర పెరుగుతుండటంతో రైతులు ఇప్పుడిప్పుడే పేట మార్కెట్‌కు తరలివస్తున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మార్కెట్‌కు రాని రైతులు ధర పెరుగుతుందనే కారణంతో పత్తిని ఇళ్లలోనే నిల్వ చేశారు. జనవరి మొదటి వారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో పత్తి దారం, క్యాండీ ధర, బెల్‌ ధరలు పెరగడంతో స్థానిక మార్కెట్‌లో సైతం పత్తి ధర పెరిగింది. పత్తికి మద్దతు ధర రూ.6,080 ఉండగా, దానికి మించి రూ.7వేల నుంచి రూ.7,500 వరకు ధర పలుకుతుండటంతో మార్కెట్‌కు రైతుల రాక పెరిగింది.

4,641 బస్తాల పత్తి కొనుగోలు

పేట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను 2022, నవంబరు 18న మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించారు. నాటి నుం చి ఈ నెల 11వ తేదీ వరకు మార్కెట్‌లో 4,641 బస్తాల పత్తిని జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులు కొనుగోలు చేశారు. రోజుకు సుమారు 100బస్తాల నుంచి 150 బస్తాల వరకు కొనుగోలు చేస్తున్నారు. జనవరి 25వ తేదీ నుంచి రోజుకు 150 బస్తాల నుంచి 200 బస్తాల పత్తి మార్కెట్‌కు వస్తోంది. ఇప్పటి వరకు 554 మంది రైతులు విక్రయించగా, 2,320 క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు.

సత్ఫాలితాలిస్తున్న ఈ-నామ్‌ విధానం

పత్తి కొనుగోలు జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విఽధానం (ఈ-నామ్‌) ద్వారా కొనసాగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. పత్తి వ్యాపారులు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు ధరలను బిడ్డింగ్‌ చేస్తారు. దీంతో ఏ వ్యాపారి ఎంత ధరను కోట్‌ చేశారో మరో వ్యాపారికి తెలిసే అవకాశం లేదు. పత్తి మార్కెట్‌ ప్రారంభ దశలో జెండా పద్ధతిలో కొనుగోలు చేయాలని కొంతమంది వ్యాపారులు మార్కెట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ-నామ్‌ విఽధానంలోనే పత్తిని కొనుగోలు చేయాలని, లేదంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని మార్కెట్‌ అధికారులు స్పష్టం చేయడంతో చేసేది లేక వ్యాపారులు ఈ-నామ్‌ విధానాన్ని పాటిస్తుండటంతో రైతులకు మద్దతుకు మించి ధర లభిస్తోంది.

Updated Date - 2023-02-13T00:24:13+05:30 IST