Share News

కామారెడ్డి భూములపై కన్ను!

ABN , First Publish Date - 2023-11-29T03:38:52+05:30 IST

కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ ఇక్కడ పోటీ చేస్తున్నాడని.. అదమరిచి కేసీఆర్‌కు ఓటు వేస్తే ఆయన గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల విలువైన రైతుల, ప్రజల భూములను కొల్లగొడతాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కామారెడ్డి భూములపై కన్ను!

వాటిని కాజేసేందుకే కేసీఆర్‌ పోటీ

భూముల్ని కాపాడేందుకే నేను బరిలో

కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే

అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్‌, గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమనిధి ఏర్పాటు చేస్తాం

కామారెడ్డి, దోమకొండ, బీబీపేటల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కామారెడ్డి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ ఇక్కడ పోటీ చేస్తున్నాడని.. అదమరిచి కేసీఆర్‌కు ఓటు వేస్తే ఆయన గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల విలువైన రైతుల, ప్రజల భూములను కొల్లగొడతాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ పాము లాంటివాడని.. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడని, కేసీఆర్‌ను నమ్మడమంటే పాముకు పాలు పోసి పెంచినట్లేనని వ్యాఖ్యనించారు. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలని కోరారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పును దేశం మొత్తం నిశితంగా గమనిస్తుందన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌ భూములను కేసీఆర్‌ పందికొక్కు మేసినట్టు మేశాడని, అల్లుడికి సిద్దిపేట, కొడుక్కి సిరిసిల్లను పంచిపెట్టాడని ఆరోపించారు. నిజామాబాద్‌లో ప్రజలు కవితను ఓడగొట్టి దుకాణం బంద్‌ చేశారన్నారు. ప్రస్తుతం భూములను కొల్లగొట్టే మాస్టర్‌ ప్లాన్‌తోనే కేసీఆర్‌ కామారెడ్డికి వస్తున్నాడని, కామారెడ్డి భూములకు కంచె వేసి కాపాడేందుకే తాను ఇక్కడ పోటీకి దిగానన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్‌ చేసిందేమి లేదని, అందుకనే కామారెడ్డిలో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లుగా గుర్తుకురాని కోనాపూర్‌ కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలు

వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్‌ మోసం చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించటమేగాక, పిల్లల చదువుకు తోడ్పాటునిస్తామని చెప్పారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబరు 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే మరుసటి రోజు నుంచే రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో నగదు వేస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీ స్కీంలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-11-29T03:38:53+05:30 IST