కడియం శ్రీహరి పద్మశాలీ ఇంట్లో పుట్టారు!

ABN , First Publish Date - 2023-07-11T02:12:37+05:30 IST

ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కడియం శ్రీహరి పద్మశాలీ ఇంట్లో పుట్టారు!

అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్‌ పొందారు

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూలై 10: ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం 60 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్‌ను అక్రమంగా వాడుకుంటున్నారని, ఆయన అసలు సిసలైన బైండ్ల కాదని ఆరోపించారు. తనది బైండ్ల కులం అని చెప్పుకుంటున్నా, ఆయన పద్మశాలీ అని, బైండ్ల ఇంట పెరిగారని ఆరోపించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడారు. ‘కడియం అమ్మ పద్మశాలీ.. ఆయన పద్మశాలీ కుటుంబంలో పుట్టిన తర్వాత బైండ్లోళ్ల ఇంటికి వచ్చి పెరిగారు. ఆయన అసలు సిసలు బైండ్ల కాదు. అయినా 14 ఏళ్లుగా రిజర్వేషన్‌ ద్వారా పదవులు అనుభవించి దళితులకు అన్యాయం చేశారు. ఇందుకు కడియంపై మాదిగ దండోరా, మాల మహానాడు వంటి దళిత సంఘాలు చర్చ జరపాలని పిలుపునిస్తున్నా’ అని రాజయ్య పేర్కొన్నారు. కడియం చరిత్ర బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు, వైస్రాయి రాజకీయాలేనని రాజయ్య ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్న 14 ఏళ్లు ఘన్‌పూర్‌ నియోజకవర్గం దగాపడిందన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో చాటుమాటు మీటింగ్‌లు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ని కలిసి వర్ధన్నపేట నుంచి ఆయన కూతురు కావ్యకు, ఘన్‌పూర్‌ నుంచి ఆయనకు టికెట్‌ ఇవ్వాలని అడిగినట్లు తన వద్దకు ఇప్పుడిప్పుడే సాక్ష్యాలు వస్తున్నాయని రాజయ్య ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయిలో మాదిగలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను, ఎంపీ పసునూరి దయాకర్‌ను రాచిరంపాన పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉన్న చోట వేలు పెట్టవద్దు అని కేసీఆర్‌ ఎన్నోసార్లు చెప్పారని, అయినా కడియం తనకు సమాచారమివ్వకుండానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.లింగంపల్లి ప్రాజెక్టు పేరు తీసుకువచ్చి కాంట్రాక్టర్‌ ఇచ్చిన పైసలతో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-07-11T02:12:37+05:30 IST