Himachal CJ : హిమాచల్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు!
ABN , First Publish Date - 2023-04-20T02:20:30+05:30 IST
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావును నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావును నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అంజాద్.ఎ.సయీద్ పదవీవిమరణ చేయడంతో ఆ పదవి ఖాళీ అయినట్లు కొలీజియం గుర్తుచేసింది. ‘‘2012 జూన్ 12న జస్టిస్ రామచంద్ర రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టును ఎంచుకున్నారు. 2021 అక్టోబరు 12 నుంచి పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు. రెండు హైకోర్టుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ పరిణామాల రీత్యా హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకానికి ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నాం’’ అని కొలీజియం తన సిఫారసుల్లో పేర్కొంది. జస్టిస్ రామచంద్ర రావు 1966లో హైదరాబాద్‌లో జన్మించారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1991లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు. న్యాయవాదిగా ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్‌డీఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, డీసీసీబీ, ఏపీ ఆర్థిక కార్పొరేషన్, సెబీ వంటి సంస్థలకు న్యాయవాదిగా పలు కోర్టుల్లో వాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌గానూ వ్యవహరించారు.