బీజేపీలోకి జయసుధ

ABN , First Publish Date - 2023-08-03T03:08:19+05:30 IST

సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారమిక్కడి పార్టీ జాతీయ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలోకి జయసుధ

ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో

బీజేపీ కండువా కప్పిన తరుణ్‌ ఛుగ్‌

బస్తీల అభివృద్ధికి ఆమె కృషి చేశారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో

దేశం ఎంతో అభివృద్ధి చెందింది

పార్టీలో చేరికపై ఏడాది నుంచే

మాట్లాడుకుంటున్నాం: జయసుధ

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారమిక్కడి పార్టీ జాతీయ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా జయసుధ ప్రజల కష్టాలు చూశారని, బస్తీల అభివృద్ధికి ఎంతో కృషిచేశారని చెప్పారు. రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, అవినీతి, కుటుంబ, నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. ఇటీవలే చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని చెప్పారు. జయసుధ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీలో చేరడానికి ముందు జయసుధ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను, చేరిన తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.


చేరికపై ఏడాది నుంచీ చర్చలు: జయసుధ

బీజేపీలో చేరడంపై ఏడాది నుంచి మాట్లాడుకుంటున్నామని, చివరకు ఈ రోజు పార్టీలో చేరానని జయసుధ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలై, మతం, కులం పరంగా కాకుండా జాతీయ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకునే బీజేపీలో చేరానని తెలిపారు. క్రైస్తవుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. కళాకారిణిగా తాను అందరికీ సంబంధించిన వ్యక్తినని చెప్పారు. ఇన్నేళ్లు రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఎమ్మెల్యేగా నా పదవీ కాలాన్ని పూర్తిచేశాను. రాజకీయాలకు దూరంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది అని నేను నమ్ముతాను’’ అని చెప్పారు. తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ.. పలు భాషల్లో 300కు పైగా సినిమాలు, 9 నంది, 7 ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న ప్రముఖ నటి జయసుధ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. జూబ్లీహిల్స్‌కు చెందిన వంశీకృష్ణ గౌడ్‌ కూడా బీజేపీలో చేరారు. ఆయనకు తరుణ్‌ ఛుగ్‌ పార్టీ సభ్యత్వాన్ని అందజేసి, కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-03T03:08:19+05:30 IST