జగన్‌ మాట మారింది!

ABN , First Publish Date - 2023-03-26T02:26:33+05:30 IST

తోడేళ్ల గుంపు’ మాట వినిపించలేదు. ‘దమ్మూ.. ధైర్యం’ సవాళ్లు అసలే లేవు. ఇక.. నిత్యం మంత్రంలా జపించే ‘దుష్ట చతుష్టయం’ అనే మాట ఒక్కసారీ పలకలేదు.

జగన్‌ మాట మారింది!

దెందులూరు సభలో ముభావంగా ఏపీ సీఎం

రాజకీయ విమర్శలు పక్కనపెట్టి ప్రసంగం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావమేనా!?

(ఏలూరు - ఆంధ్రజ్యోతి)

‘సింగిల్‌ సింహం’ డైలాగ్‌లేదు. ‘తోడేళ్ల గుంపు’ మాట వినిపించలేదు. ‘దమ్మూ.. ధైర్యం’ సవాళ్లు అసలే లేవు. ఇక.. నిత్యం మంత్రంలా జపించే ‘దుష్ట చతుష్టయం’ అనే మాట ఒక్కసారీ పలకలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస దెబ్బలు తగిలిన ఎఫెక్ట్‌ కాబోలు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాట ఒక్కసారిగా మారిపోయింది. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన ‘ఆసరా’ నిధు ల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పొలిటికల్‌ ప్రసంగాలు చేయడం, గిట్టని మీడియాపై నిందలు వేయడం, ‘175 స్థానాల్లో పోటీచేసే ధైర్యముందా’ అని విపక్షాలకు సవాళ్లు విసరడం జగన్‌కు బాగా అలవాటైన పని! కానీ.. ఈ సభలో జగన్‌ పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దూషణలు, సవాళ్లు, నిందలు, ఆరోపణల సంగతి పక్కన పెడితే.. పరోక్షంగా కూడా చంద్రబాబు, పవన్‌ల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. సభ ప్రారంభం నుంచి చివరి దాకా ముభావంగానే కనిపించారు. తనను పొగుడుతూ ప్రసంగిస్తున్నప్పుడు మాత్రం ముఖంపై నవ్వు కనిపించింది. ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం తొలిసారి ప్రజల్లోకి వచ్చిన సీఎం మాటలో తేడా స్పష్టంగా కనిపించింది.

ఖాళీ రోడ్డుకు దండాలు..!

దెందులూరులో హెలిప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌ మొదలైంది. ఆ దారిలో జనంలేకపోయినప్పటికీ.. ఖాళీ రోడ్లకు జగన్‌ నమస్కారాలు చేసుకుంటూ రావడం చూసేవాళ్లకు చోద్యంగా అనిపించింది. దారిలో రోడ్లుకు ఇరువైపులా పోలీసులు రెండు రోజుల క్రితమే బారికేడ్లు అమర్చారు. ఊళ్లోకి వెళ్లేసరికి అక్కడక్కడ కొన్ని సెంటర్లలో ప్రజలు హారతులతో ఎదురొచ్చారే తప్ప దారి పొడవునా ప్రజలు కనిపించలేదు. ఇక.. ప్రతిసారీ సీఎం ప్రసంగం ప్రారంభించాక జనం గేట్లు తోసుకుని, గోడలు దూకి పారిపోవడం జరుగుతోంది. కానీ.. దెందులూరులో సభ ప్రారంభానికి ముందునుంచే జనం ఇంటిబాట పట్టారు. సభా ప్రాంగణానికి సీఎం షెడ్యూల్‌కంటే అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సభకు తీసుకొచ్చిన ప్రజలు అల్లాడిపోయారు. వందలాది మంది ప్రజలు శిబిరాల బయటే ఉండిపోవడంతో నిలువనీడ కరువైంది.

Updated Date - 2023-03-26T02:26:33+05:30 IST