నీలగిరికి ఐటీ మణిహారం

ABN , First Publish Date - 2023-05-26T01:09:05+05:30 IST

ఐటీ హబ్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నీలగిరికి ఐటీ మణిహారం

శరవేగంగా ఐటీహబ్‌ నిర్మాణం

మరో మూడు నెలల్లో ప్రారంభానికి సిద్ధం

రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు

నల్లగొండ, మే 25 : జిల్లా కేంద్రానికి మణిహారంగా ఐటీ హబ్‌ నిలవనుంది. ఇప్పటికే స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో చేపట్టినఐటీహబ్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరో మూడు నెలల్లో ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐటీ కంపెనీలు అంటే ఒకప్పుడు హైదరాబాద్‌ మహానగరానికే పరిమితం కాగా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ వంటి పెద్దపట్టణాలకు కూడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని విస్తరింపజేస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండలో రూ.75కోట్లతో ఐటీహబ్‌ నిర్మాణం చేపట్టింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం తో పాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు వివిధ అభివృద్ధి పనులతో పాటు ఐటీహబ్‌ను తీసుకొచ్చేందు కు కృషి చేశారు. ఇప్పటికే 16 కంపెనీలతో ఒప్పం దం చేసుకున్న ప్రభుత్వం ఆ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేందుకు సహాయ సహకారాలు అందించనుంది. ఐటీహబ్‌ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే పరిశ్రమలను పలు బ్లాకు ల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అన్ని కంపెనీలు పని ప్రారంభిస్తే రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా సొనాటా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ అమెరికాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌, ఆరోగ్యరంగం, లైఫ్‌సైనెన్స్‌ రంగాల్లో సేవలను అందించనుంది.

ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఇవే

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మొత్తం 16 కంపెనీలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. స్ల్పాష్‌బీ, సీ2ఎస్‌ టెక్నాలజీ/సంహిత, పీజీకే టెక్నాలజీస్‌, ఎర్మిటేజ్‌ఇన్‌ఫో, ఇన్‌ఫోజంక్షన్‌, ఎన్‌ఎ్‌ఫవోఎల్‌కేఎ్‌స-ఐఎన్‌సీ, ఎస్‌వైఎ్‌సటీఈసీహెచ్‌, న్యూమరిక్‌ టెక్నాలజీస్‌, విన్నింగ్‌ ఎడ్జ్‌ సొల్యూషన్స్‌, డిజిక్‌ఫార్మ్‌ ఐఎన్‌సీ, కానెక్స్‌ఏఎల్‌, స్మార్స్‌ ఐంఎసీ, ఏవీ ఎంటర్‌ప్రైజస్‌ కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే ఈ ఐటీ హబ్‌లో ఈ కంపెనీలన్నీ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మూడునెలల్లోనే కార్యకలాపాలన్నింటినీ పూర్తి చేసి యువతి, యువకులకు ఉపాధి అవకాశాలను అందిచే దిశగా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

Updated Date - 2023-05-26T01:09:30+05:30 IST