Minister KTR : ఆవిష్కరణల ప్రోత్సాహానికి టీ-వర్క్స్‌

ABN , First Publish Date - 2023-03-02T02:39:07+05:30 IST

ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే మొట్టమొదటి ఇన్నోవేషన్‌ సెంటర్‌ ‘టీ-వర్క్స్‌’ను అందుబాటులోకి తెస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేలలో విత్తనం నాటే పనిముట్టు నుంచి నింగిలోకి

Minister KTR : ఆవిష్కరణల ప్రోత్సాహానికి టీ-వర్క్స్‌

దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ కేంద్రమిది .. తెలంగాణ వ్యాప్తంగా శాటిలైట్‌ సెంటర్ల ఏర్పాటు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

నేడు టీ-వర్క్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, రాయదుర్గం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే మొట్టమొదటి ఇన్నోవేషన్‌ సెంటర్‌ ‘టీ-వర్క్స్‌’ను అందుబాటులోకి తెస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేలలో విత్తనం నాటే పనిముట్టు నుంచి నింగిలోకి పంపే రాకెట్‌ల వరకు టీ-వర్క్స్‌లో రూపుదిద్దుకునేలా ఇక్కడ పూర్తి సౌకర్యాలు కల్పించామన్నారు. రాయదుర్గంలో దాదాపు ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను గురువారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి బుధవారం టీ-వర్క్స్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. టీ-వర్క్స్‌ భవనాన్ని గురువారం సాయంత్రం ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యాంగ్‌ యూ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. మల్టీమీడియా రంగంలో ఆవిష్కరణల కోసం ఇమేజ్‌ టవర్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. టీహబ్‌ రెండో విడతలో 4.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయం, ఇమేజ్‌ టవర్‌లో 16 లక్షల చదరపు అడుగుల వర్క్‌ప్లేస్‌ అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ సెంటర్ల నిర్మాణం పూర్తికావచ్చిందని, ఆయా కేంద్రాల్లో టీహబ్‌, టీ-వర్క్స్‌, వీహబ్‌, టాస్క్‌ శాటిలైట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. టీ-వర్క్స్‌లో 3డి ప్రింటింగ్‌, డిజైనింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌, చిప్‌ డిజైన్‌కు సంబంధించిన అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ. 15 కోట్ల విలువైన యంత్రాలు ఇక్కడ ఉన్నాయన్నారు.

సైబర్‌ సెక్యూరిటీ

సెంటర్‌ ప్రారంభం

మంత్రి కేటీఆర్‌ రాయదుర్గంలోని ఐటీ కారిడార్‌లో గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా మన దగ్గరకు ఇజ్రాయెల్‌ కంపెనీ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సైబర్‌ సెక్యూరిటీ ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, సంస్థలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఒక ప్రభుత్వంగా తాము సైబర్‌ సెక్యూరిటీ ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, దేశంలోనే సైబర్‌ సెక్యూరిటీ పాలసీని విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచామన్నారు. సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సైబర్‌ఆర్క్‌ ఇండియా రీజినల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ రోవాన్‌ వైద్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వ్యూహాత్మకమైందన్నారు. దేశంలో కంపెనీ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - 2023-03-02T02:39:07+05:30 IST