‘గృహలక్ష్మి’లో దివ్యాంగుల రిజర్వేషన్‌ ఏదీ?

ABN , First Publish Date - 2023-06-26T02:37:45+05:30 IST

సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 లక్షలు అందించేందుకు ‘గృహలక్ష్మి

‘గృహలక్ష్మి’లో దివ్యాంగుల రిజర్వేషన్‌ ఏదీ?

మార్గదర్శకాల్లో కనిపించని 5ు రిజర్వేషన్‌!.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రకటించిన సర్కారు

8 రాష్ట్రంలో 5.16 లక్షల మంది దివ్యాంగులు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 లక్షలు అందించేందుకు ‘గృహలక్ష్మి’ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ నెల 21న జారీ చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మార్గదర్శకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్‌ను విస్మరించింది. దివ్యాంగులకు అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని జనవరి 1, 2018న విడుదల చేసిన జీవో నంబరు 1 ఆదేశాలను మరచిపోయింది. ఫలితంగా గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్‌ అందని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5,16,890 మంది దివ్యాంగులకు పింఛను అందుతోంది. కానీ, గతంలో సర్కారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 10.48 లక్షల మంది దివ్యాంగులున్నట్లు తేలడం గమనార్హం. అయితే ఈ వివరాలను సర్కారు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సుమారు లక్ష మందికి పైగా దివ్యాంగులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారు..

గృహలక్ష్మి పథకం అమలు మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ, దివ్యాంగులకు కేటాయించాల్సిన 5 శాతం రిజర్వేషన్‌ను ప్రస్తావించలేదు. వాస్తవానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని దివ్యాంగుల హక్కుల చట్టం 2016లోని 37(బి) సెక్షన్‌ సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్‌ను అమలు చేస్తుండగా.. గృహలక్ష్మిలో మాత్రం పొందుపర్చకపోవడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు. ప్రస్తుత పథకాల్లో అమలు చేస్తున్నామంటున్న 5శాతం రిజర్వేషన్‌ కూడా నామమాత్రమేనని వాపోతున్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్‌ను పొందుపరచాలి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గృహలక్ష్మి పథకం మార్గదర్శకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్‌ను పొందుపరచలేదు. ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ఉత్తర్వులున్నా క్షేత్రస్థాయిలో అమలు నామమాత్రంగానే ఉంటోంది. దివ్యాంగులకు ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి గృహలక్ష్మి పథకం మార్గదర్శకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్‌ను పొందుపర్చాలని కోరాం.

Updated Date - 2023-06-26T02:37:45+05:30 IST