జమిలితో దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం
ABN , First Publish Date - 2023-09-04T03:44:03+05:30 IST
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలను బీజేపీ తెరపైకి తెచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకమే.. అధ్యక్ష తరహా ఎన్నికలకు బీజేపీ కుట్ర
ఓటమి భయంతోనే మళ్లీ తెరపైకి.. వన్ నేషన్-వన్ పార్టీ అనేది బీజేపీ విధానం
దీన్ని ‘ఇండియా’ వ్యతిరేకిస్తోంది.. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
జమిలిపై బీఆర్‌ఎస్ వైఖరేంటో ఇప్పుడు స్పష్టం చేయాలి: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలను బీజేపీ తెరపైకి తెచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఏర్పడుతాయంటూ సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చాయని, తెలంగాణలో కాంగ్రె్‌సకు 38శాతం, బీఆర్‌ఎ్‌సకు 31 శాతం ఓట్లు రానున్నట్లు సీ ఓటర్ సర్వేలో తేలిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అవమానకర పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ నినాదాన్ని బీజేపీ ఎత్తుకున్నదని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికలతో దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష తరహా ఎన్నికలను తీసుకొచ్చేందుకే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని బీజేపీ ముందుకు తెచ్చిందని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా బీజేపీని అక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. మణిపూర్ అంశం పార్లమెంట్‌లో చర్చకు రాకుండా చేసి, ప్రజలను పక్కదారి పట్టించారన్నారు. ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల పేరిట హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు . ఈ విధానానికి ఇండియా కూటమి వ్యతిరేకమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఎంపీ అధీర్ రంజన్.. ఆ కమిటీ నుంచి వైదొలిగారని వెల్లడించారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్న కేసీఆర్.. జమిలి ఎన్నికలపైన బీఆర్‌ఎస్ వైఖరి ఏంటన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి జమిలి ఎన్నికలకు అనుకూలంగా 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ద్వారా లా కమిషన్ చైర్మన్ చౌహాన్‌కు పంపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌కు కేసీఆర్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలు
ఈ దేశం.. రాష్ట్రాల సమూహమని, జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ఒక పార్టీ చేతిలోనే అధికారం ఉండాలన్నది బీజేపీ విధానమని అన్నారు. ఈ కుట్రను తాను ముందుగానే ఊహించి లోక్ సభలో ప్రస్తావించానని, బీజేపీది వన్ నేషన్.. వన్ పార్టీ విధానమని చెప్పానని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. ఆయన బీజేపీకి అనుకూలమని అనుకోవాలా? నిలదీశారు. పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకూ బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని, బీజేపీ.. బీఆర్‌ఎ్‌సలు వేర్వేరు కాదని, ఒకే తాను ముక్కలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారని విమర్శించారు. జమిలి విధానంపై వేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతిని చైర్మన్‌గా నియమించి, ఆ పదవికే కళంకం తెచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులుతెచ్చినా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
వీలైతే.. వాల్మీకీ బోయలకు సీటు
అవకాశం ఉంటే.. అధిష్ఠానం అనుమతితో వాల్మీకి బోయలకు ఎమ్మెల్యే సీటు ఇస్తామని, వీలు కాని పక్షంలో ఎమ్మెల్సీ సీటును ఇచ్చే ప్రయత్నం చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాకు చెందినవాల్మీకీ బోయలు కోరారు. రేవంత్ మాట్లాడుతూ బోయ భీముడిని ఎమ్మెల్సీని చేస్తానంటూ2014లో మాట ఇచ్చిన కేసీఆర్.. పదేళ్లయినా దాన్ని నిలబెట్టుకోలేదన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి, మాట తప్పారని మండిపడ్డారు. కాగా..24 గంటల కరెంట్ గురించి కేసీఆర్ చెప్పే మాటలు వినీవినీ అబద్ధమే సిగ్గుపడుతోందని, కళ్ల ముందు పంటలు ఎండుతుంటే కోతలరాయుడు ‘కారు’కూతలు కూస్తూనే ఉన్నాడని రేవంత్ ట్వీట్ చేశారు.