Share News

Minister Damodara : కొవిడ్‌ టెస్టులు పెంచండి

ABN , Publish Date - Dec 24 , 2023 | 04:20 AM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Minister Damodara : కొవిడ్‌ టెస్టులు పెంచండి

నెలాఖరునాటికి రోజుకు 4 వేల పరీక్షలు

ఆర్టీపీసీఆర్‌ పాజిటివ్‌ శాంపిల్స్‌

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపండి

నిరుపయోగ ఆక్సిజన్‌ ప్లాంట్లను

వినియోగంలోకి తేవాలి

వైద్యశాఖ ఉన్నతాధికారులకు

మంత్రి దామోదర ఆదేశం

కొత్తగా మరో 12 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/ఎర్రగడ్డ/మంగళ్‌హాట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ టెస్టులు పెంచాలని, ఈనెలాఖరు నాటికి రోజుకు 4 వేల కొవిడ్‌ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఉప్పల్‌లోని సీఎడీఎ్‌ఫడీతోపాటు గాంధీ ఆస్పత్రికి పంపాలని ఆదేశించారు. వారం రోజుల్లో 40 ఆర్టీపీసీఆర్‌ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. 40లో 30 నమూనాలు ప్రైవేటు నుంచి, 10 ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించినవని అధికారులు తెలిపారు. కాగా ఆస్పత్రుల్లో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్లను తక్షణమే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను వినియోగించాలని కోరారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున వివిధ విభాగాధిపతులు తక్షణమే వారి పరిధిలోని ఆస్పత్రుల్లో అవసరమైన ఔషధాలు, యంత్రాలు, డయాగ్నస్టిక్స్‌ కన్జ్యూమబుల్స్‌ ఇండెంట్స్‌ వెంటనే పెట్టాలని ఆదేశించారు. హెల్త్‌ సెక్రటరీ హెచ్‌వోడీలతో సమావేశమై, డ్రగ్స్‌, కన్జ్యూమబుల్స్‌ స్టేట్‌సపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల వరకు కొవిడ్‌ కేసుల బులిటెన్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. నాలుగేళ్లలో వైద్య ఆరోగ్యశాఖకు కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద ఇచ్చిన ఔషధాలు, యంత్రాలు, కిట్స్‌ సహా అన్ని వివరాలతో నివేదికను తక్షణమే అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు.

నిలోఫర్‌లో మరో చిన్నారికి కొవిడ్‌....

రాష్ట్రంలో కొత్తగా మరో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,322 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నారు. మరో 30 నమూనాల ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో మెజారిటీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. శనివారం వరంగల్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో మరో తొమ్మిది మందికి వైరస్‌ సోకింది. నగరంలో 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 34 మంది కొవిడ్‌ బారినపడ్డారు. చిన్న పిల్లల్లో కొవిడ్‌ నిర్ధారణ అవుతుండడంతో వైద్యులు అప్రమత్తమవుతున్నారు. న్యుమోనియా, తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులుంటే వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, ఉస్మానియా, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు ముమ్మరం చేశారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో మరో చిన్నారికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో నిలోఫర్‌లో కొవిడ్‌ బారిన పడిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ఈ నెల 22న 51 మంది చిన్నారుల నుంచి నమూనాలు తీసుకుని పరీక్షకు పంపగా అందులో వట్టేపల్లి నుంచి పలు ఆరోగ్య సమస్యలతో వచ్చిన ఆరు నెలలపాపకు కొవిడ్‌ ఉన్నట్టు తేలింది. ఆ చిన్నారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి తెలిపారు. ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో తాజాగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.

Updated Date - Dec 24 , 2023 | 04:31 AM