ఆగని కుక్కల దాడులు
ABN , First Publish Date - 2023-03-02T02:26:38+05:30 IST
రాష్ట్రంలో వీధికుక్కల దాడులు ఆగడం లేదు. ఇటీవలే ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి, చంపేసిన ఘటనతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం ఉలిక్కిపడిన
పేట్‌బషీరాబాద్/వరంగల్ టౌన్/తొర్రూరు రూరల్, మార్చి1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీధికుక్కల దాడులు ఆగడం లేదు. ఇటీవలే ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి, చంపేసిన ఘటనతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. నగరంతో పాటు పలు జిల్లాల్లో ఆ తరహా వీధికుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం ఓ వీధికుక్క రెచ్చిపోయింది. దారిన వెళ్తున్న ఆరుగురిపై దాడి చేసింది. కొంపల్లి మునిసిపల్ కార్యాలయం సమీపంలో సాయంత్రం రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న డి.శివానీ(16), క్రాంతి(10), బాపూరావు(50), ఏ.మీనాక్షి(20), వి.దుర్గ(27), ప్రీతి(25)పై దాడిచేసి, గాయపర్చింది. దీంతో వారందరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఓ బాలుడు.. ఓ వృద్ధురాలిపై...
వరంగల్‌లో ఓ బాలుడు, మహబూబాబాద్‌లో ఓ వృద్ధురాలిపై వీధికుక్కలు దాడిచేశాయి. హైదరాబాద్‌లో నివాసముంటున్న బండారి ఆమని-మనోజ్ దంపతులకు ఏడేళ్ల కుమారుడు రోహిత్ ఉన్నాడు. ఆమని తమ్ముడు సందీప్ పెళ్లి పనుల కోసం వారు వరంగల్‌లోని కాశీబుగ్గకు వచ్చారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో రోహిత్ ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ కుక్క అతడిపై దాడి చేసింది. బాలుడి అరుపులతో వారంతా ఇంట్లో నుంచి బయటకు రావడంతో కుక్క అతడిని వదిలిపెట్టి పారిపోయింది. రోహిత్ ముఖంపై గాయాలై, రక్తం కారుతుండగా వెంటనే అతడిని చికిత్స కోసం ఎజీఎం ఆస్పత్రికి తరలించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శీలం రమాబాయి(65) ఆరుబయట కూర్చొని ఉండగా ఆమెపై వీధి కుక్కలు దాడిచేశాయి. వెంటనే ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ఆమె కోడలు శీలం స్వాతి వచ్చి, కుక్కలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా... ఆమెపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రమాబాయి ముక్కుకు తీవ్రగాయం కాగా, స్వాతి చేతి వేళ్లకు గాయాలయ్యాయి.