రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:33 AM
‘‘సీఎం రేవంత్‌రెడ్డి కథను సినిమాగా తీస్తే సూపర్ హిట్ గ్యారంటీ’’ అని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి అన్నారు. రేవంత్ జీవితంలో అంతటి ఆసక్తికరమైన అంశాలున్నాయని చెప్పారు.
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి
రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అభినందన సభ
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి కథను సినిమాగా తీస్తే సూపర్ హిట్ గ్యారంటీ’’ అని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి అన్నారు. రేవంత్ జీవితంలో అంతటి ఆసక్తికరమైన అంశాలున్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రతినిధులు శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించారు. రేవంత్ చిత్రకారుడని, చిత్రకారుడు సీఎం కావడం కళారంగానికి గర్వకారణమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దశరథరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదవాలని అప్పట్లో రేవంత్‌కు చాలా కోరిక. మూడుసార్లు ప్రవేశ పరీక్ష రాశారు. ఒకసారి 8వ ర్యాంకు వచ్చినా సీటు దక్కలేదు. అతను అదే ఏడాది రాజకీయాల్లోకి వెళ్లాడు. తర్వాత కలిసినప్పుడు ఆ రోజు సీటు రాకపోవడమే మంచిదైందని ఇద్దరం అనుకున్నాం’’ అని గుర్తుచేసుకొన్నారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. కళారంగానికి చెందిన వ్యక్తి సీఎం కావడం అత్యంత అరుదైన సందర్భమని సంతోషం వ్యక్తం చేశారు. చిత్రకారులు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా పదేళ్లుగా ఒకే వ్యక్తి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా ఉండటం అత్యంత దారుణమని మామిడి హరికృష్ణను ఉద్దేశిస్తూ అన్నారు. ఆ డైరెక్టర్‌ను వెంటనే మార్చాలని కోరారు. 83 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి స్థలం కేటాయించాల్సిందిగా సమావేశం ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ప్రతీ ప్రభుత్వ బడిలో ఆర్ట్ టీచర్‌ను నియమించాలని కోరారు. అలాగే హైదరాబాద్‌లో కేంద్ర లలిత కళా అకాడమీ రీజనల్ సెంటర్ ఏర్పాటు, తెలంగాణ లలిత కళల అకాడమీ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.