Share News

Minister Harish Rao : కాంగ్రెస్‌ వస్తే కరువులు, కర్ఫ్యూలే

ABN , First Publish Date - 2023-10-22T01:48:20+05:30 IST

మ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని.. కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరువు, కర్ఫ్యూలు వస్తాయని మంత్రి హరీశ్‌రావు

 Minister Harish Rao : కాంగ్రెస్‌ వస్తే కరువులు, కర్ఫ్యూలే

ఆ పార్టీ సంస్కృతి మాటలు, ముఠాలు, మంటలు..

కేసీఆర్‌ పాలనలో ఇవేవీ లేవు: హరీశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని.. కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరువు, కర్ఫ్యూలు వస్తాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు అని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ చెరుకు సుధాకర్‌తోపాటు పలువురు నాయకులు శనివారం బీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మూడోసారి కూడా సీఎంగా కేసీఆర్‌ ఉంటేనే అభివృద్ధిలో తెలంగాణ ముందుకువెళ్తుందని విశ్వసించి చెరుకు సుధాకర్‌ పార్టీలో చేరారని అన్నారు. ఆయన పార్టీలోకి రావడంతో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు బలం వచ్చిందని, అందరం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆరోపించారు. రైతుబంధు పథకం సృష్టికర్త కేసీఆర్‌ అని, ఆయనకు పనితనమే తప్ప.. పగ లేదన్నారు. ఒకవేళ పగ ఉంటే.. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ జైలు నుంచి బయటకు వచ్చేవాడు కాదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూడటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి కూడా సీఎం అవుతానంటూ ప్రకటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సకు లెహర్‌ లేదు, జహర్‌ మాత్రమే ఉందని, రాహుల్‌గాంధీ తన పేరును రాంగ్‌గాంధీగా మార్చుకోవాలని హరీశ్‌రావు అన్నారు.

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి

కానే కాదన్న, రానే రాదన్న తెలంగాణను తెచ్చి, పింఛన్లను పెంచిన కేసీఆర్‌ మళ్లీ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మరో తిరుపతిలా యాదాద్రి ఆలయాన్ని నిర్మించుకున్నామని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసుకున్నామని, ఫ్లోరోసిస్‌ రహితంగా చేసుకున్నామని గుర్తుచేశారు. అందరం కలిసి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్‌ కొట్టిన సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకలో కరెంటు సరిపడా ఇవ్వడం లేదని అక్కడి రైతులు ఏకంగా మొసళ్లను తీసుకెళ్లి కరెంటు ఆఫీసుల్లో వదిలారని హరీశ్‌రావు చెప్పారు. సోనియాగాంధీని నోటికొచ్చినట్టు తిట్టిన వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకుని రాజకీయాలు చేసేంత భావదారిద్య్రంతో కాంగ్రెస్‌ ఉన్నదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ గురిపెట్టిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా, ఆనాడు రాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. తన డీఎన్‌ఏలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే ఉందని రాహుల్‌గాంధీ చెబుతున్నారని.. కానీ ఆయన పక్కనే ఉంటున్న రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, తెలుగుదేశం పార్టీలలో ఏ పార్టీ ఉన్నదో తెలుసుకోవాలని, ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు మారారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

ఎల్లప్పుడు తెలంగాణ ప్రజల పక్షానే ఉంటా

ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని గడపడంతోపాటు, తెలంగాణ భవన్‌ పునాదుల్లో కూడా పాలుపంచుకున్నాని చెరుకు సుధాకర్‌ గుర్తుచేశారు. తన ఆలోచనకు తెలంగాణ భవన్‌ పదును పెట్టిందన్నారు. సికింద్రాబాద్‌లో పార్టీ ప్లీనరీ సందర్భం గా ‘టీఆర్‌ఎస్‌ తెలంగాణ గుండె చప్పుడు’ అని ఒక బోర్డుపై రాశానని, దాన్ని కేసీఆర్‌ చదివారని చెప్పారు. ఎల్లప్పుడూ తాను తెలంగాణ ప్రజల పక్షానే ఉంటానన్నారు.

Updated Date - 2023-10-22T01:48:20+05:30 IST