కేటీఆర్‌పై ఆరోపణల నుంచి వెనక్కి తగ్గబోను

ABN , First Publish Date - 2023-07-21T03:16:13+05:30 IST

మంత్రి కేటీఆర్‌పై తాను చేసిన ఆరోపణల నుంచి వెనక్కి తగ్గబోనని, క్షమాపణలు కూడా చెప్పబోనని ఘరానా మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశాడు.

కేటీఆర్‌పై ఆరోపణల నుంచి వెనక్కి తగ్గబోను

ఆయన అహంకారం నా వద్ద పని చేయదు: సుకేశ్‌

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌పై తాను చేసిన ఆరోపణల నుంచి వెనక్కి తగ్గబోనని, క్షమాపణలు కూడా చెప్పబోనని ఘరానా మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశాడు. ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్‌ ఇటీవల కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర గవర్నర్‌కు, సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ సుకేశ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు పంపించారు. దానికి సమాధానంగా గురువారం సుకేశ్‌ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. దర్యాప్తు ద్వారా తాను కేటీఆర్‌ను ఎండగడుతానని, కేటీఆర్‌ ఎత్తుగడల కంటే ఈ దేశ న్యాయవ్యవస్థ శక్తివంతమైందని పేర్కొన్నారు. కేటీఆర్‌ అహంకారం తన వద్ద పనిచేయలేదని పేర్కొన్నారు. తనను కేటీఆర్‌ మోసగాడని, రోగ్‌ అని సంబోధించారని, చీకటి లావాదేవీలు, డీల్స్‌ చేయడానికి తనను ఉపయోగించుకున్నప్పుడు ఎందుకు అలా సంబోధించలేదని ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోబోనని, తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.

Updated Date - 2023-07-21T03:16:13+05:30 IST