Share News

నాకు రేషన్‌ కార్డు వద్దు

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:31 AM

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నాకు రేషన్‌ కార్డు వద్దు

మా అమ్మకు పింఛను వద్దు

బడంగ్‌పేట్‌ డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌

సరూర్‌నగర్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రేషన్‌కార్డును రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. తన తల్లికి పింఛన్‌ కూడా వద్దని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే తనలాంటి ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఆర్థిక స్థోమత ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వదులుకోవాలని ఆయన సూచించారు. బడంగ్‌పేట్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 23 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ బాలాపూర్‌ సర్పంచ్‌గా, బడంగ్‌పేట్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా పని చేశానని, ప్రస్తుతం కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 23 ఏళ్లుగా తన తల్లి పింఛను ఇప్పించమని అడుగుతున్నదని, అయినా తాను ఆ దిశగా ప్రయత్నం చేయలేదని చెప్పారు. తల్లిదండ్రులను పోషించలేని పిల్లలు ఉన్నవారికి మాత్రమే పింఛను ఇవ్వాలని, అనర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డుల వంటి పథకాలను అందించడం వల్ల అర్హులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని శేఖర్‌ అభిప్రాయపడ్డారు. ఎంతోకొంత ఆర్థిక స్థోమత ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను పొందడం భావ్యం కాదని భావించి తాను రేషన్‌ కార్డును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Updated Date - Dec 30 , 2023 | 03:31 AM