Swami Vivekananda: ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-01-12T21:24:06+05:30 IST

ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన స్వామి వివేకానంద ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారు.

Swami Vivekananda: ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
Swami Vivekananda

హైదరాబాద్: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు ఎదగాలని భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర పిలుపునిచ్చారు. సూరారం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన తర్వాత ఆయన వందలాది మంది విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. వివేకానంద చికాగో ప్రసంగంలోని అంశాలను ఆయన ప్రస్తావించారు. సోదరి నివేదిత సహా వేలాది మంది పాశ్చాత్యులను స్వామి వివేకానంద ప్రభావితులను చేశారని చెప్పారు.

కార్యక్రమానికి ముఖ్యవక్తగా విచ్చేసిన రామకృష్ణ మఠం వాలంటీర్ నారాయణరావు మాట్లాడుతూ బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ, శ్రీఅరబిందో సహా అనేక మంది స్వాతంత్ర్యవీరులకు స్వామి వివేకానంద స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. వివేకానంద సాహిత్యం చదివాక తనలో దేశభక్తి వెయ్యిరెట్లు పెరిగిందని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తు చేశారు. స్వామి వివేకానంద జీవించి ఉంటే ఆయన పాదాల చెంత ఉండేవాడినని సుభాష్ చంద్రబోస్ అన్నారని చెప్పారు. స్వామి వివేకానంద చికాగో వెళ్లే ముందు 1893 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో వారం రోజుల పాటు పర్యటించారని నారాయణరావు చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన స్వామి వివేకానంద ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారని చెప్పారు. పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమతో విజయం సాధించవచ్చన్న స్వామి వివేకానంద బోధనలు నిరంతరం గుర్తు చేసుకోవాలన్నారు. మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ, రోగి దేవోభవ అని స్వామి వివేకానంద పిలుపునిచ్చారని, నిరుపేదలను ఉద్ధరించడమే జీవిత లక్ష్యంగా చేసుకోవాలన్నారని చెప్పారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావెద్ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు పరమత సహనం ప్రాధాన్యతను తెలియజేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన ఉపాధ్యాయులు వివేకానందుడి జీవితంలో జరిగిన సరదా ఘటనలను, స్ఫూర్తిదాయక విశేషాలను వివరించారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అందించిన స్వామి వివేకానంద సాహిత్యాన్ని విద్యార్ధులకు బహుకరించారు.

కార్యక్రమంలో సేవాభారతి మల్లికార్జున్, పుణ్యవతి, వెంకట్రావ్, మహేశ్, రాజేశ్, లక్ష్మణ్, కృష్ణయ్య, గౌరీశంకర్, వెంకటయ్య, పాండు చౌహాన్, శైలజ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T21:45:53+05:30 IST