Share News

Sanjay BJP : తబ్లీగీ జమాత్‌కు నిధులెలా ఇస్తారు..?

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:22 AM

ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లీగీ జమాత్‌ సంస్థ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులెలా విడుదల చేస్తుందని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఉగ్రవాదులను తయారు

Sanjay BJP : తబ్లీగీ జమాత్‌కు నిధులెలా ఇస్తారు..?

ఉగ్ర సంస్థకు ఇవ్వడం వెనక ఉద్దేశమేంటి

పథకాల అమలు.. అర్జీలతోనే సరిపెట్టొద్దు

కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడిస్తారు: సంజయ్‌

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 25: ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లీగీ జమాత్‌ సంస్థ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులెలా విడుదల చేస్తుందని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఉగ్రవాదులను తయారు చేసే, బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడే సంస్థకు నిధులు ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం కరీంనగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజ్‌పేయ్‌ జయంతిని పురస్కరించుకొని సంజయ్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈ రోజుల్లో.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం ప్రధాన మంత్రి వంటి అత్యున్నత పదవిని వదిలేసుకున్న మహనీయుడు వాజ్‌పేయ్‌ అని కొనియాడారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సాకుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కావద్దని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షలకుపైగా కుటుంబాలు రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.శ్వేతపత్రం.. స్వేద పత్రం అంటూ అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు విడుదల చేసుకుంటున్నారని కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సను విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.50 లక్షల కోట్ల ఆస్తులను సృష్టిస్తే భూములెందుకు అమ్ముకున్నారని, జీతాలెందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.6.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. అసలు అప్పులను ఎలా తీరుస్తారో, ఆరు గ్యారెంటీల అమలుకు నిధులెక్కడి నుంచి తీసుకొస్తారో ప్రజలకు వివరించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 01:22 AM