Share News

సీట్ల సర్దుబాటు ఎలా?

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:16 AM

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆదివారమిక్కడ భేటీ అయ్యారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..

సీట్ల సర్దుబాటు ఎలా?

హైదరాబాద్‌లో పవన్‌తో చంద్రబాబు చర్చలు

జనసేనాని నివాసానికి టీడీపీ అధినేత..

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆదివారమిక్కడ భేటీ అయ్యారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుపై సమీక్షించారు. ఉమ్మడి మేనిఫెస్టో, కలిసి బహిరంగసభల నిర్వహణ, ఉభయుల పొత్తు బలోపేతం, ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. ఈ రెండు పార్టీలూ కలిసే ఎన్నికల్లో పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీల అగ్రనేతలు తరచూ భేటీ అవుతున్నారు. పవన్‌ కొద్దిరోజుల కిందట చంద్రబాబు నివాసానికి వెళ్లగా.. టీడీపీ అధినేత ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని పవన్‌ నివాసానికి వెళ్లారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన జనసేనాని నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంపై సమీక్షించారు. చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో ముద్రించిన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఎప్పుడు దీనిని విడుదల చేస్తారో త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి జనసేన మరికొన్ని అంశాలు జోడించి మొత్తం 10 అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేన కొన్ని సూచనలు చేసింది. కాగా.. తన కార్యక్రమాల షెడ్యూల్‌ ముందుగానే ఖరారు కావడంతో.. ఈ నెల 20న విశాఖలో జరిగే యువగళం ముగింపు సభకు హాజరుకాలేకపోతున్నానని పవన్‌.. చంద్రబాబుకు తెలిపినట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆయన రాత్రికి మీడియాకు వెల్లడించారు. ‘భావి రాజకీయ కార్యాచరణ, ఎన్నికల యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేతలు పూర్తిస్థాయిలో చర్చించారు. పాలక వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే గాక.. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త రాష్ట్రం చేసేందుకు అవసరమైన అన్ని అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలక అంశాల గురించి తర్వాత ప్రత్యేక మాట్లాడతాం’ అని వివరించారు.

Updated Date - Dec 18 , 2023 | 03:16 AM