High court : నోటరీ భూములను ఎలా రిజిస్టర్ చేస్తారు?
ABN , First Publish Date - 2023-08-31T04:03:55+05:30 IST
పట్టణ ప్రాంతాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో వివరించాలని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో వివరించాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పట్టణ ప్రాంతాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్టర్ చేయడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 84ను కొట్టివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు పైవిధంగా స్పందించింది. ఈ పిటిషన్ పిల్ కిందకు రాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ.. ఆ వ్యాజ్యానికి నంబర్ ఇవ్వలేదు. అభ్యంతరాల నోట్‌తో సహా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌ల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ సంస్థ భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం జూలై 26న జీవో 84 జారీచేసిందని.. ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న నోటరీ భూములను సైతం పరిశీలిస్తామని ప్రభుత్వం పేర్కొందని.. ఈ నిబంధన భారీ లిటిగేషన్‌కు తావిస్తుందని వివరించారు. చట్టవిరుద్ధంగా అమాయకుల నుంచి భూములను చేజిక్కించుకున్న వారు కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాంప్ డ్యూటీలు, జరిమానాలు లేకుండా రిజిస్టర్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్, ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ వంటి కేంద్ర చట్టాలకు విరుద్ధంగా.. జీవో జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. పిటిషన్‌కు రెగ్యులర్ నంబర్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, రెవెన్యూ, మునిసిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులను నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా పడింది.