Share News

యాసంగిపైనే ఆశలు.!

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:11 PM

యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల సాగు పనులు ఊపందుకున్నాయి. పలు గ్రామాల్లో రైతులు 15 రోజుల క్రితమే నారు మడులు సిద్ధం చేశారు. నాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసుకుంటూ రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం సాగుపై భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

యాసంగిపైనే ఆశలు.!

ఆశాజనకంగా భూగర్భజలాలు

అతివృష్టితో కన్నీళ్లే మిగిల్చిన వానాకాలం

యాసంగి పంటలసాగుపై దృష్టిసారించిన రైతులు

చెరువులే కాదు.. బోర్ల ద్వారా పంటల సాగుకు సన్నద్ధం

పొలం పనుల్లో రైతులు బిజీబిజీ

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల సాగు పనులు ఊపందుకున్నాయి. పలు గ్రామాల్లో రైతులు 15 రోజుల క్రితమే నారు మడులు సిద్ధం చేశారు. నాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసుకుంటూ రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం సాగుపై భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

పరిగి, డిసెంబరు 26: యాసంగి సాగుపై అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రధానంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్‌; కొడంగల్‌, తాండూరు ప్రాంతాల్లో ఐదారేళ్ల క్రితం కంటే ఈ సారి ఆశాజనకంగా వర్షం కురిసింది. ఈ వానాకాలం సీజన్‌లో కురిసిన భారీ వర్షాలతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం వాటిల్లినప్పటీకీ, భారీ వర్షాలకు పెరిగిన భూగర్భజలాలతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చెరువులతో పాటు, బోర్లలో కూడా భూగర్భజల మట్టాలు పెరుగడంతో యాసంగి పంటలసాగుకు నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి యాసంగిలో వివిధ రకాల పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు కానుంది. కొత్త ప్రభుత్వం సాగుపై భరోసా, ధాన్యం కొనుగోకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు.

120 వరకు చిన్న మధ్య తరహా చెరువులు, ప్రాజెక్టులు

వికారాబాద్‌ జిల్లాలోని 19 మండలాల్లో 120 వరకు చిన్న మధ్య తరహా చెరువులు, ప్రాజెక్టులు ఉంటాయి. వీటి కింద దాదాపు 40వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరందుతుంది. జిల్లాలోని లక్నాపూర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. కోట్‌పల్లి, జంటుపల్లి, సాలార్‌నగర్‌, బొంరాసిపేట్‌, హాస్నాబాద్‌, ఏర్పుమల్ల, గడిసింగాపూర్‌, దోమ చెరువులతో పాటు, చిన్నాచితకా చెరువలన్నీ జలకళతో కళకళాడుతున్నాయి. ఈ చెరువుల కింద,బోర్ల ఆధారంగా సాగుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో 65 వేలకుగాపైగా వ్యవసాయ బోర్లు ఉంటాయి. అయితే బోరు బావుల్లో కూడా భూగర్భ మట్టాలు పెరగడంతో సాగు చేసేందుకు రైతులు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. శనగసాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, శనగ, వేరుశనగలతో పాటు కూరగాయల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. చెరువులు, కుంటల కింద విస్తారంగా వరి తదితర పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కొత్త ప్రభుత్వం యాసంగికి సంబంధించిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు

జిల్లాలో యాసంగి సీజన్‌లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు కానుంది. గత ఏడాది వివిధ పంటల కలిసి 1,02,159 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ సారి సాధారణ విస్తీర్ణం దాటే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. వరి గత ఏడాది 55,959 ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి 59,179 ఎకరాల్లో సాగు కానుంది. శనగలు గత ఏడాది 8,441 ఎకరాలు కాగా, ఈ సారి 13,098 ఎకరాలు, వేరుశనగ గత ఏడాది 6,526 ఎకరాలు కాగా, ఈసారి 14,735 ఎకరాలు, జొన్నలు గతేడాది 4,481 ఎకరాలు కాగా, ఈసారి 5,601 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇవే కాకుండా రాగులు, గోధుమలు, కుసుమలు, నువ్వులు, ఆముదాలు, అలసంద తదితర పంటలు కూడా గత ఏడాది కంటే ఈసారిఎక్కువగా సాగు కానుంది. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వేరుశనగ, శనగ విత్తనాలు విత్తారు.

దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలు

ఈసారి వానాకాలం సీజన్‌లో వరి, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగి భారీ నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటల పరిస్థితి ఇలా ఉంటే పత్తి రైతుల పరిస్థితి మరోలా ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి వాతావరణం అనుకూలించడంతో ఏపుగా పెరిగిన పత్తి చేళ్లు కూడా అధిక వర్షాలకు దెబ్బతిన్నాయి. పత్తి చేళ్లలో నీరు చేరడం, ఆపై బెల్లంరోగం రావడంతో ఆకు, గూడ, కాయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. వానాకాలం నష్టాన్ని యాసంగిలో పూడ్చుకోవాలని రైతులు ఆశతో ఉన్నారు.

ఘట్‌కేసర్‌ మండలంలో 4 వేల ఎకరాల్లో వరిసాగు

ఘట్‌కేసర్‌ రూరల్‌ : మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని అవుశాపూర్‌, అంకుశాపూర్‌, మర్రిపల్లిగూడ, ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలతో పాటు మూసీపరివాహాక ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎదులాబాద్‌, పోతరాజిగూడ, మాదారం, కొత్తగూడెం, కొర్రెముల, వెంకటాపూర్‌, ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం, ముత్వేల్లిగూడ తదితర గ్రామాలలో దాదాపు 4వేల ఎకరాలలో వరిసాగు చేయనున్నారు. ఇప్పటికే దున్నకం పనులు చేపట్టారు. ఈయేడాది యాసంగిలో ఎంటీయూ1010, కెఎంఎన్‌ 118 దొడ్డు రకాలను 40శాతం, హైబ్రీడ్‌ (సంకరజాతి) రకాలను60శాతం విత్తనాలు వేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అధికారులు ఘట్‌కేసర్‌లోని రైతుసేవా సహాకార సంఘంతో పాటు ఎదులాబాద్‌ ఉపకేంద్రంలో ఎరువులను అందుబాటులో ఉంచారు. డీఏపీ, రసాయన ఎరువులకు బదులుగా జీవనఎరువులు(పీఎ్‌సబీ)వాడితే ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయ అధికారులు సూచిసున్నారు.

బోర్లలో నీరు పెరిగింది.

ఈ సారి బోరుబావుల్లో నీరు ఆశాజనంగా ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు పనులు చేపట్టాను. వానాకాలం సీజన్‌ చివర్లో కురిసిన వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. యాసంగిపై ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేస్తున్నాం. కరెంట్‌ ఉంటే చాలు పంటలు చేతికి అందినట్లే.

-నీరటి నరహరి, రైతు, రంగంపల్లి08పిఆర్‌జి15

ఫ చెరువు కింద తైబంధు ఖరారు చేశాం

ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోన్‌సతో ఈయాసంగి సాగు కోసం రైతులు ముందుకు వస్తున్నారు. అదును దాటుతుందని ముందుగానే మెట్లకుంట చెరువు కింద 160 ఎకరాల్లో పంటల సాగు కోసం తైబంధు ఖరారు చేశాం.

13కెడియల్‌6: నర్సిములునాయుడు, మెట్లకుంట

వేదజల్లే పద్దతలో నారువేస్తున్న

నేను 1156, 1290, 468, 400 వంటి వరి రకాల విత్తనాలను కొనుగోలు చేసి డ్రమ్‌ సీడర్‌ ద్వారా వేదజల్లే పద్దతిలో నాట్లు వేస్తున్నాను. దీంతో నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు తగ్గుతుంది. లక్ష్మీనారాయణ చెరువు ఆయకట్ట కింద ఉన్న చుట్టు కాలువలను సరిచేకోవడం జరిగింది. మరో వారం పదిరోజులలో నాట్లు జోరందుకుంటాయి.

- ఉప్పు లింగేశ్వర్‌రావు, రైతు ఎదులాబాద్‌

యాసంగికి పంటలుకు సమాయత్తం

యాసంగి పంటల సాగుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నాం. శనగలు, వేరుశగన సాగు పూర్తి కావస్తుంది. వరి, ఇతర పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా రైతులకు అవసరం ఉన్న విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. బోర్లు, చెరువుల కింద పంటల సాగు ప్రారంభమైంది.

- లక్ష్మీకుమారి,ఏడీఏ పరిగి 08పిఆర్‌జి14

దుకాణ యజమానుల నుంచి రశీదులు పొందాలి

రైతులు ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేస్తే సంబంధిత దుకాణ యజమానుల నుంచి రశీదులు పొందాలి. వారం రోజులుగా చలితీవ్రత పెరిగింది. వరినారు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. దీని నివారణకు ప్రతీ రోజు నారుమడిలోని నీటిని మార్చాలి. ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరి సాగులో రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.

వీరస్వామి, కులకచర్ల మండల వ్యవసాయ అధికారి

Updated Date - Dec 27 , 2023 | 12:16 AM