హోంగార్డ్ రవీందర్ మృతి
ABN , First Publish Date - 2023-09-09T03:41:29+05:30 IST
పై అధికారుల దూషణలను భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు మంత్రి రవీందర్ (38) మృతి చెందాడు.
3 రోజులపాటు మృత్యువుతో పోరాటం
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
రవీందర్ భార్య, కుటుంబసభ్యుల ఆందోళన
కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మధ్యాహ్నం దాకా ఆస్పత్రి వద్ద బైఠాయింపు
ఏఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు
ఆస్పత్రికి వచ్చిన రేవంత్, చాడ, కేఏ పాల్
రవీందర్ భార్యను పరామర్శించిన నేతలు
మంగళ్‌హాట్/చంపాపేట్/అఫ్జల్‌గంజ్/చాంద్రాయణగుట్ట సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పై అధికారుల దూషణలను భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు మంత్రి రవీందర్ (38) మృతి చెందాడు. కాలిన గాయాలతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. రవీందర్ మరణించిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారమందించారు. అయితే, కుటుంబసభ్యులు చేరుకునేలోపే చంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్‌కుమార్, కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్ శేఖర్‌రెడ్డి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమకు చెప్పకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారని మృతుడి భార్య సంధ్య, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. చివరికి పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఓపీ ప్రధాన ద్వారం వద్ద రవీందర్ భార్య సంధ్య తన బంధువులతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏఎ్‌సఐ నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. కనీసం సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సైతం అధికారులు చూపించలేదని, ఫుటేజీ చూస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని వాపోయారు. తన భర్త మరణానికి బాధ్యులైనవారిపై కఠిన చర్చలు తీసుకోవడంతో పాటు తన కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఆమె ఆందోళన విరమించకపోవడంతో డీసీపీ కిరణ్, ఏసీపీలు, సీఐలు ఆమెతో పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం తరువాత ఉన్నతాధికారులు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించారు. దీంతో ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగం వైద్యులు రవీందర్ మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. హోంగార్డులు విధులు బహిష్కరించి ఉస్మానియాకు వస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు ఉస్మానియా మార్చురీ, ఓపీ భవనాల వద్ద భారీ బందోబస్తు చేశారు. కాగా, ఏఎస్సై నర్సింగ్‌రావు, ఏఆర్ కానిస్టేబుల్ చందులపై కేసు నమోదైంది. వారిద్దరిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు.
అసలేం జరిగిందంటే...
జీతం సమయానికి రాకపోవడంతో కారణాలు తెలుసుకునేందుకు రవీందర్ ఈనెల 5న గోషామహల్ పోలీ స్ గ్రౌండ్‌లో ఉన్న హోంగార్డు కార్యాలయానికి వెళ్లాడు. జీతం విషయమై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందులను అడిగాడు. వారు దూషించడంతో పాటు చిన్నచూపు చూడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్.. బయటికొచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది ప్రభుత్వ హత్యే: రేవంత్ రెడ్డి
హోంగార్డులకు జీతాలు ఇచ్చే సోయి ఈ ప్రభుత్వానికి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు వచ్చి రవీందర్ భార్యను పరామర్శించారు. రవీందర్ విషయంలో ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. రవీందర్ భార్యను ఉస్మానియాలో పరామర్శించారు. కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైందని, వేతనం అందక హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్వీట్ చేశారు. రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఉప్పుగూడలోని నివాసానికి తరలించారు. అనంతరం నల్లవాగు హిందు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.