‘నాన్‌ క్లినికల్‌’కు భలే డిమాండ్‌!

ABN , First Publish Date - 2023-01-23T04:34:38+05:30 IST

వైద్య కళాశాలల్లో నాన్‌ క్లినికల్‌ విభాగం అధ్యాపకులకు డిమాండ్‌ భారీగా పెరిగింది.

‘నాన్‌ క్లినికల్‌’కు భలే డిమాండ్‌!

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాన్‌ క్లినికల్‌ అధ్యాపకులకు భారీ వేతనాలు.. ప్రైవేటులో అరకొరే

ఫలితంగా ‘సర్కారు’లోకి ప్రొఫెసర్లు

ప్రైవేటు కాలేజీల్లో అధ్యాపకుల కొరత

భారీ వేతనాలు ఆఫర్‌ చేస్తున్న వైనం

ఈ ఏడాది మరో 9 సర్కారీ కాలేజీలు

అధ్యాపకులకు పెరగనున్న డిమాండ్‌!

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో నాన్‌ క్లినికల్‌ విభాగం అధ్యాపకులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. గతంలో వీరికి ఉద్యోగం దొరికితే చాలన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఒకవేళ దొరికినా అనుకూలమైన ప్రాంతంలో ఉండేది కాదు. అలాగే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. నాన్‌ క్లినికల్‌ అధ్యాపకులకు వేతనాలు కూడా తక్కువగా ఇచ్చేవారు. అది కూడా 3, 4 నెలలకోసారి ఇచ్చేవారు. నాన్‌ క్లినికల్‌ అంటే రోగులతో సంబంఽధం లేని విభాగాలు. ఇందులో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విభాగాలకు అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం, మంచి జీతాలు ఇస్తుండడంతో ప్రైవేటులో ఉన్నవారంతా ఇటువైపు వచ్చేశారు. ఫలితంగా ప్రైవేటులో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఇప్పుడు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు నాన్‌క్లినికల్‌ అధ్యాపకులకు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని ప్రకటించడంతో కొందరు సర్కారీ కళాశాలల నుంచి జంప్‌ అవుతున్నారు. ఉదాహరణకు సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో నాన్‌ క్లినికల్‌ విభాగంలో అధ్యాపకురాలు తక్కువ వేతనానికే పనిచేస్తుండేవారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వైద్య కళాశాలలో నాన్‌ క్లినికల్‌ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షల వేతనాన్ని ఆఫర్‌ చేసింది. అంతేగాక మరో రూ.50 వేలు అదనంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆమె నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరారు. అలా ఏడాది కూడా చేయకముందే గతంలో పనిచేసిన ప్రైవేటు కాలేజీ యాజమాన్యం ఆమెకు రూ.3 లక్షల వేతనం ఆఫర్‌ చేసింది. దీంతో ఆమె సర్కారీ కళాశాలలో కాంట్రాక్టు కొలువుకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోయాయి.

నాన్‌ క్లినికల్‌ విభాగాల అధ్యాపకులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా జీతాలు ఇస్తున్నారు. గత ఏడాది సర్కారు కొత్తగా 8 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నాన్‌ క్లినికల్‌ అధ్యాపకులకు డిమాండ్‌ మరింత పెరగనుంది. గతంలో మెజారిటీ ప్రొఫెసర్లంతా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనే పనిచేసేవారు. అక్కడ అత్యంత తక్కువ వేతనాలకు పనిచేయాల్సి వచ్చేదని ఓ ప్రొఫెసర్‌ తెలిపారు. పీజీల్లో మెజారిటీ విద్యార్థులు క్లినికల్‌ వైపే మొగ్గుచూపుతారు. ఎందుకంటే నాన్‌ క్లినికల్‌ విభాగాల వారికి రోగులతో పని ఉండదు. పూర్తిగా అకడమిక్‌ వైపే ఉంటారు. కాలేజీలు, విద్యార్థులు, బోధన అంశాలకే పరిమితం అవుతారు. అందుకే పీజీలో నాన్‌ క్లినికల్‌ విభాగంలో సీట్లు ఏటా పెద్ద సంఖ్యలో మిగిలిపోతుంటాయి. దీంతో ఈ విభాగాల్లోని అధ్యాపకులకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. ఉన్నవారినే అన్ని కాలేజీలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జాతీయ వైద్య కమిషన్‌ తనిఖీలు చేసిన తర్వాత కొంతమందిని ప్రైవేటు కాలేజీలు తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు.

జంప్‌ చేస్తున్న ప్రొఫెసర్లు..

అవకాశాలు పెరగడం, ఎక్కువ వేతనాలు, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉండే అవకాశం లాంటి అంశాలను నాన్‌ క్లినికల్‌ విభాగపు అధ్యాపకులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రైవేటు నుంచి ఎక్కువగా ప్రభుత్వ కాలేజీలకు జంప్‌ చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగ భద్రత ఉండడం, నెలనెలా వేతనం వస్తుండడంతో సర్కారీ కళాశాలలకే జై కొడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలు కూడా వేతనాలను రెట్టింపు చేశాయి. ఈ కాలేజీలు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో సర్కారీలో దూరప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు మళ్లీ ప్రైవేటు కాలేజీలకు వెళుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. మొత్తం గా సాఫ్ట్‌వేర్‌లో మాదిరిగా నాన్‌ క్లినికల్‌ అధ్యాపకులు అటూ ఇటూ జంప్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-01-23T04:35:01+05:30 IST