High Court : జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2023-09-22T03:44:34+05:30 IST

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామక ప్రక్రియకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతి మంజూరు చేసింది.

High Court : జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి

‘సింగరేణి’ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును పక్కనపెట్టిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామక ప్రక్రియకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతి మంజూరు చేసింది. గతేడాది సెప్టెంబరు 4న నిర్వహించిన పరీక్ష ఆధారంగా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు సింగరేణికి మార్గం సుగమమైంది. ఆ పరీక్షలో అక్రమాలు జరిగాయని, సింగరేణి సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం.. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఈ ఏడాది ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై సింగరేణి, పరీక్షలు రాసిన ఇతర అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

సింగరేణి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ వాదనలు వినిపిస్తూ జేఎన్‌టీయూ సహకారంతో పరీక్షను పకడ్బందీగా నిర్వహించామని, ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. అక్రమాలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సింగిల్‌ జడ్జి అన్ని అంశాలను పరిశీలించి, పరీక్షలో అక్రమాలు జరిగాయనే భావన అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మళ్లీ నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి తీర్పును పక్కనపెట్టింది. ఈ నియామక ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, అయితే పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన దర్యాప్తునకు లోబడి నియామకాలు ఉంటాయని పేర్కొంది. డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై సింగరేణి సంస్థ ఫైనాన్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగం డైరెక్టర్‌ బలరాం హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు త్వరలో జారీ చేస్తామన్నారు.

Updated Date - 2023-09-22T03:45:00+05:30 IST